హైదరాబాద్,(విజయక్రాంతి): ఒడిషా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న(Ganja Smuggling) పశ్చిమబెంగాల్ వాసిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.1.50లక్షల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)కు వచ్చిన ఖోడాబాక్స్ అనే ఓ వ్యక్తి ప్లాట్ ఫాం నంబర్ 2 పై దిగాడు. ముంబై వెళ్లేందుకు కోనార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫాం నంబర్ 7కు వెళుతుండగా అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు అతన్ని తనిఖీ చేశారు. అతని వద్ద ఆరు కిలోల గంజాయి లభించడంతో అరెస్ట్ చేశారు. అతనితో పాటు గంజాయి విక్రేత ఒడిషాకు చెందిన అలీఖాన్, ముంబైకి చెందిన కొనుగోలు దారుడు జాయ్ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో రైల్వే సీఐ బీ.సోయిఈశ్వర్‌గౌడ్, సీఐ. డి.రమేష్, తదితరులు పాల్గొన్నారు.