calender_icon.png 20 March, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటకెక్కిన ఆరు గ్యారెంటీలు

20-03-2025 01:30:00 AM

  1. ఓం బీం బుష్.. అన్నట్లు రాష్ట్ర బడ్జెట్
  2. ఎన్నికల ముందు మ్యానిఫెస్టో పవిత్ర గ్రంథం
  3. అధికారంలోకి వచ్చాక చిత్తు కాగితం
  4. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): ‘తెలంగాణ బడ్జెట్ ఉత్త డొల్ల. ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ ఇక అటకెక్కినట్లే. బడ్జెట్‌లో హామీలకు సంబంధించిన ఊసే లేదు.  పద్దు ఓం..బీం.. బుష్ అన్నట్లు ఉంది’ అని కేంద్ర హోం సహాయశాఖ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

రాష్ట్ర బడ్జెట్‌పై బుధవారం ఆయన స్పందిస్తూ.. అంకెల గారడీతో ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నదని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి రాగానే చిత్తు కాగితంగా భావిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిందని ప్రభుత్వం గొప్పులు చెప్తుందని, అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరచి ఉంటు బాగోతమంతా బయటపడేదని ఎద్దేవా చేశారు.

తద్వారా ఒక్కో తెలంగాణ పౌరుడిపై ఎంత అప్పు భారముందో తెలిసిపోయేదన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2. 91 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన సర్కార్.. ఆచరణలో మాత్రం రూ.2 లక్షల కోట్లునా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున నిర్మిస్తామని బీరాలు పలికి, ఇప్పుడు పద్దులో ఇండ్ల నిర్మాణానికి రూ.7,500 కోట్లు కేటాయించడం చేతగాని తనమని దుయ్యబట్టారు.

అంబేద్కర్ అభయ హస్తం పేరుతో ఒక్కో ఎస్సీ లబ్ధిదారుకు రూ.12 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించి, పద్దులో అందుకు నిధులు కేటాయింపులు లేకపోవడం సిగ్గుచేటన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ.67 వేల కోట్ల అప్పు చేస్తే, ఈ ప్రభుత్వం 15 నెలల్లోనే రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆరు గ్యారంటీల అమలు కోసం ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేసేలా సవరణ చేయాలని డిమాండ్ చేశారు.