రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారాడు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
ఎల్బీనగర్: కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 66 అబద్దాలతో అధికారంలోకి వచ్చి... గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఆదివారం చైతన్యపురిలోని బృందావన్ హాస్టల్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతోనే ప్రజల నుంచి ఇండ్లు, భూములు లాక్కునే కార్యక్రమం చేపట్టిందన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని ప్రజల భూములు, పేదల ఇళ్లు అడ్డుగోలుగా లాక్కుంటుంటే చూస్తూ ఊరుకుంటామా... గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుంది చూసుకో రేవంత్ రెడ్డి అని హెచ్చరించారు.
ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ దుర్మార్గాలని బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామన్నారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు... ఫార్మా సిటీ పేరున గత ప్రభుత్వం 30 వేల ఎకరాలు సేకరిస్తే, ఇప్పుడు నీ ప్రభుత్వం 16 వేల ఎకరాలు సేకరించబోతున్నదని ఆరోపించారు. లగచర్ల ప్రజలు నీపై తిరుగుబాటు మొదలు పెట్టారు. ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరన్నారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
డిసెంబర్ 7 న సరూర్ నగర్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించే బీజేపీ భారీ బహిరంగ సభను శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ బాధితులు, మూసీ నిర్వాసితులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు రంగా నర్సింహ గుప్తా, నాయకులు సురేందర్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.