సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్..
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నికల సమయంలో, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ప్రజా వ్యతిరేకత తప్పదని, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ అన్నారు. ఆ పార్టీ కడం మండలంలో ఈ నెల 20వ తేదీన చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, కరపత్రాలను విడుదల చేశారు. ఎన్నికల సమయంలో, ఇచ్చిన మేనిఫెస్టో, వరంగల్ డిక్లరేషన్ రెండు లక్షల రుణమాఫీ ఇంకా సగం కూడా కాలేదని, రైతుబంధు ఎకరాంకు 15000 ఇస్తామని, 12000 ఇవ్వడం శోచనీయమని, మాట తప్పిన ప్రభుత్వం, ఇందిరమ్మ ఇల్లు పథకం సంవత్సరం దాటిన ఆచరణ రూపం దాల్చలేదని, పోడు భూములకు పట్టాలిస్తానని నమ్మబలికారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు, ఉద్యోగులకు, ఇచ్చిన హామీలను వాగ్దానాలను అమలు చేయలేదని అన్నారు.
చేయూత పథకం ఇంకా ప్రారంభమే కాలేదని, ధరణి దోషులపై చర్యలు కానరావడం లేదని, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి, విద్యా, వైద్య, రంగాలలో, ఏ మార్పు రాలేదని, ప్రజా పాలన అసలే లేదని, బూటకపు ఎన్కౌంటర్లు యధావిధిగా కొనసాగుతున్నాయని, పౌర, ప్రజాస్వామ్య, హక్కులు కాలరాయపడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, డిమాండ్ చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ నెల 20వ తేదీన, హైదరాబాద్లో ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి దుర్గం లింగన్న, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గోనే స్వామి, గూట్ల ప్రసాద్, రాములు, కుడుదుల రాజేష్, నరేష్ తదితరులు ఉన్నారు.