calender_icon.png 6 November, 2024 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు పనులకు రూ.654.86 కోట్లు

30-06-2024 01:25:05 AM

  • మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

ఖమ్మం, జూన్29 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు రహదారి పనులకు అనుమతులతో పాటు అభివృద్ధికి రూ.654.86కోట్లు డీబీఆర్ విడుదల కానున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. వీటికి  ఈ ఏడాది యాక్షన్ ప్లాన్‌లోనే సాంకేతిక మంజూరులు కూడా దక్కించుకుని టెండర్ పిలుస్తారని తెలిపారు. 2024 సంవత్సరానికి అనుమతి పొందిన ఆరు నేషనల్ హైవే ప్రాజెక్ట్ పనుల వివరాలిలా ఉన్నాయి. 25కిలోమీటర్ల మేరా కొత్తగూడెం, పాల్వంచల మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు రూ.450కోట్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. ఇల్లెందు, తల్లాడ, పెనుబల్లి ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా నేరుగా బైపాస్‌రోడ్డుకు వచ్చే విధంగా అనిశెట్టిపల్లి నుంచి బైపాస్ నిర్మించనున్నట్లు తెలిపారు.

ఎన్‌హెచ్ 365ఏ ఎన్‌హెచ్ 163జీ మధ్య 6కిలోమీటర్లు లింక్ రహదారి నిర్మాణానికి 125కోట్లు, టెంపుల్ టౌన్ భద్రాచలం అభివృద్ధి కోసం ఎన్‌హెచ్ 7కిలోమీటర్ల మేర విస్తరించే పనులకు రూ.50కోట్లు, కొత్తగూడెంలోని కలెక్టరేట్ వద్ద కొత్తగా ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.64కోట్లు, ఎన్‌హెచ్ 30 మీదున్న బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టినగర్ సమీపంలో కిన్నెరసాని నదిపై నూతన వంతెన నిర్మాణానికి రూ.20.22 కోట్లు, ఖమ్మానికి సమీపాన ఉన్న కోదాడ క్రాస్‌రోడ్ నుంచి వరంగల్ క్రాస్‌రోడ్ వరకు ఉన్న రహదారి అభివృద్ధి పనులకు రూ.7 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక నుంచి ఏటూరినాగారం వరకు 93కిలోమీటర్లు  ఫోర్ వే రహదారి నిర్మాణానికి, జగ్గయ్యపేట  కొత్తగూడెం వరకు 100కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పోలవరం ముంపు వల్ల రద్దయిన భద్రాచలం రాజమండ్రి  రహదారి సర్వేను మార్చి సారపాక బూర్గంపహాడ్ వర కు 100కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఖమ్మం ఓఆర్‌ఆర్  దేవరపల్లి హైవేకు మధ్య సర్వీస్ రోడ్డు, ఖమ్మంలో ఫ్లు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు  మంత్రి  వెంట ఉన్న ఎన్‌హెచ్‌ఏఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ దివ్య తెలిపారు.