ఫతేహాబాద్ (హర్యానా): హర్యానాలోని ఫతేహాబాద్‌లో శుక్రవారం అర్థరాత్రి 14 మందితో వెళ్తున్న వాహనం కాలువలోకి పడిపోవడంతో కనీసం ఆరుగురు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. పలువురు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ జగదీష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని ఫజిల్కాలో ఓ వివాహ వేడుకకు హాజరైన 14 మంది తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం ఫతేహాబాద్‌లోని కాలువలోకి దూసుకెళ్లింది.
14 మందిలో 6 మంది మృతదేహాలను వెలికి తీశామని, 2 మంది సజీవంగా ఉన్నారని, మిగిలిన 6 మంది గల్లంతయ్యారని తెలిపారు. "మేము ముగ్గురిని రాత్రి రక్షించాము, వారిలో ఒకరు రాత్రిలోనే మరణించారు. మిగిలిన ఇద్దరు సజీవంగా ఉన్నారు. మేము మరో 5 మృతదేహాలను వెలికితీశాము. మృతదేహాలను గుర్తించాము. NDRF, SDRF బృందాలు శోధన, రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఆరు మృతదేహాలు వెలికి తీశామని, ఇంకా ఆరుగురి ఆచూకీ లభించలేదు’’ అని SDM చంద్ర విలేకరులతో అన్నారు.
"మృతులను వారి కుటుంబాలు గుర్తించాయి. మరణించిన వారిలో 1.5 నెలల శిశువు, 10 ఏళ్ల బాలిక, ఒక పురుషుడు, ఒక మహిళ ఉన్నారు" అని ఆయన తెలిపారు. నీటిపారుదల శాఖతో మాట్లాడిన తర్వాత కాలువలో నీటిమట్టం తగ్గిందని, కాల్వ చుట్టూ శాశ్వత బారికేడింగ్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, ప్రస్తుతానికి తాత్కాలికంగా సేఫ్టీ బారికేడ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.