12-02-2025 01:52:59 AM
నాళ్ల వెంకటేశ్వర్లు :
తిమ్మాపూర్, ఫిబ్రవరి ౧1: ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలందరూ బీదాబిక్కి కుటుంబాలకు చెందినవారే అనేది జగమెరిగిన సత్యం. నిరుపేద కుటుంబాల్లో పిల్లలకు పొద్దున అల్పాహా రం అందించడం ఆర్థికంగా వెసులబాట య్యే విషయం కాదు. అలాంటి కుటుంబాల నుంచి పదోతరగతి చదువుతున్న పిల్లలు ప్రత్యేక తరగతులకు వెళ్తున్నందున ప్రభుత్వం వారి కడుపు నింపేం దుకు స్నాక్స్ నిధులు విడుదల చేస్తున్నది.
ఆ సొమ్ముపైనా కక్కుర్తి పడి ఓ ప్రధానోధ్యాయిని పిల్లల సగం కడుపే నింపుతు న్నారు. ఈ వ్యవహారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని మాడల్ స్కూల్‌లో కొద్దిరోజులుగా నడుస్తుండగా తాజాగా వెలుగులోకి వచ్చింది. తిమ్మాపూర్ మోడల్ స్కూల్‌లో 100 మంది విద్యార్థు లు పదోతరగతి చదువుతున్నారు.
వీరికి స్నాక్స్ అందించేందుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున.. రోజుకు రూ. 1,500 విడుదల చేస్తున్నది. ఏజెన్సీలు ఈ నిధులతో విద్యార్థులకు స్నాక్స్ సమకూర్చాల్సి ఉన్నది. కానీ.. ప్రిన్సిపాల్ వనజ అసలు ఏజెన్సీకి పనే అప్పగించలేదు. అంతేకాదు.. కాసులకు కక్కుర్తి పడి ఆమే స్నాక్స్ అందించే బాధ్యత తీసుకున్నారు. ప్రిన్సిపాల్‌కు టీచర్లు కూడా వంత పాడడం గమనార్హం.
స్నాక్స్ పంపిణీ ఇలా..
ప్రిన్సిపాల్ ప్రతిరోజూ ఒక్కో విద్యార్థికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి సరిపెట్టేస్తున్నా రు. మార్కెట్‌లో ఒక్కో బిస్కెట్ ప్యాకెట్ విలువ రూ.5 ఉండగా, ప్రిన్సిపాల్ హోల్‌సేల్‌లో ఒక్కో ప్యాకెట్‌ను రూ.3కే కొనుగోలు చేస్తున్నారని తెలిసింది. బిస్కెట్ ప్యాకెట్‌తో పాటు అప్పుడప్పుడు విద్యార్థుల చేతిలో పిడికెడు గుడాలు పెడుతున్నారని తెలిసింది.
కొన్నిసార్లు ప్రధానోపాధ్యాయురాలే స్కూల్‌కు స్వయంగా వంట సామగ్రి తీసుకువచ్చి, తోచిన స్నాక్స్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. ప్రిన్సిపాల్ ఇలా ఒక్కో విద్యార్థిపై ఐదారు రుపాయలు మాత్రమే ఖర్చు చేసి, మిగిలిన సొమ్మును బుక్కేస్తున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
కనిపించని సమయ పాలన..
పదోతరగతి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ప్రత్యేక తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నది. విద్యార్థులు సమయానికి స్కూల్‌కు వచ్చినా టీచర్లు మాత్రం 8:30 నుంచి 9.00 గంటల మధ్య వస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. తాము పిల్లలను హడావుడిగా రెడీ చేసి, స్కూల్‌కు పంపిస్తుంటే టీచర్లు ఆలస్యంగా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రతిరోజూ విద్యార్థులే చీపురు పట్టి పాఠశాలను శుభ్రం చేస్తున్నారు. పరీక్షల దగ్గరపడుతున్న సమయంలో విద్యార్థులు పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం కోరకుంటుంటే, ప్రిన్సిపాల్ ఆ ఆకాంక్షలను నెరవేర్చడం లేదంటున్నారు.
వారితో పారిశుధ్య పనులు చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి పిల్లలకు నిబంధనలకు అనుగుణంగా స్నాక్స్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఆకాంక్ష ఇది..
పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని యాజమాన్యాలను ఆదేశించింది. దీనిలో భాగంగా విద్యార్థులు ప్రతిరోజూ ప్రత్యేక తరగతులకు వస్తున్నారు.
తల్లిదండ్రులు కూడా ప్రతిరోజూ తెల్లవారుజామున పిల్లలకు అల్పాహారం అందివ్వడం ఆర్థిక భారమే. విద్యార్థులు మధ్యాహ్న భోజనంతో సరిపెట్టుకుని సాయంత్రం వరకు తరగతులు వినడం, ఆ తర్వాత ప్రత్యేక తరగతులకు హాజరు కావడమనేది కష్టతరమైంది. దీంతో వారికి స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అందు కు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున నిధులు విడుదల చేస్తున్నది. స్కూల్ ప్రిన్స్‌పాల్ పర్యవేక్షణలో ఏజెన్సీ నిర్వాహకులు నిధులను వెచ్చించి విద్యార్థులకు స్నాక్స్ అందించాల్సి ఉన్నది. ఉడికించిన బొబ్బర్లు, పెసర్లు, శనగలు, పల్లీలు, బెల్లం, మిల్లెట్స్ బిస్కెట్లు, పకోడీలు.. ఇలా రోజుకొక రకం సమకూర్చాల్సి ఉన్నది.
పిల్లల స్నాక్స్‌పై కక్కుర్తి..
తిమ్మాపూర్ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వనజ కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. నిరుపేద పిల్లల నోటికాడ కూడును బుక్కేస్తున్నారు. ప్రతిరోజూ వంద మంది పదోతరగతి విద్యార్థులకు బిస్కెట్స్ అందించి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో పిల్లలు సగం కడుపు నింపుకొని ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. ప్రిన్సిపాల్‌కు టీచర్లు కూడా సహకరించడం దారుణం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి.
మల్యాల రాకేశ్, ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ