calender_icon.png 29 March, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ఆరుగురి అరెస్ట్

25-03-2025 12:35:23 AM

  • ముగ్గురు అధికారుల సస్పెన్షన్

తన ప్రమేయంలేదని బాధిత విద్యార్థిని ఆవేదన

పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని వేడుకోలు

నల్లగొండ, మార్చి 24 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన విద్యాశాఖ విచారణ నిర్వహించి ముగ్గురిని విధుల నుంచి తొలగించింది.

పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డిపార్ట్‌మెంటల్ అధికారి రామ్మోహన్‌రెడ్డితోపాటు పరీక్ష కేంద్రం ఇన్విజిలేటర్ సుధారాణిని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రం బయటకు వెళ్లేందుకు కారణమైన విద్యార్థిని సైతం పరీక్షలు రాయకుండా డీబార్ చేసింది.

ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఓ బాలుడు, జిరాక్స్ కేంద్రం నిర్వాహకుడు ఉన్నారు. వీరి నుంచి ఐదు సెల్‌ఫోన్లు, జిరాక్స్ మిషన్, కంప్యూటర్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. 

ప్రశ్నపత్రం బయటకు వెళ్లిందిలా!

ఈ నెల 21న పదో తరగతి తెలుగు పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే నకిరేకల్ పట్టణం కడపర్తిరోడ్డులోని ఎస్సెల్బీసీ గురుకుల బాలుర పాఠశాలలో తెలుగు ప్రశ్నాపత్రం లీకైంది. ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. గోడ దూకి పరీక్ష కేంద్రంలోకి వచ్చిన ఓ బాలుడు గదిలో కిటికీ వద్ద పరీక్ష రాస్తున్న విద్యార్థిని ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి జిరాక్స్ కేంద్ర నిర్వాహకుడికి పంపినట్లు తెలిసింది.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ, పోలీసుశాఖ దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు లీకేజీలో ప్రమేయం లేకున్నా తనను పరీక్షల నుంచి డీబార్ చేయడంపై బాధిత విద్యార్థిని ఝాన్సీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఎవరో చేసిన తప్పుకు నన్ను బలిచేయొద్దు పరీక్ష రాసే అవకాశం కల్పించాలి’ అని విద్యార్థిని సోమవారం మీడియా ఎదుట అధికారులను వేడుకుంది. కాగా విద్యార్థినితోపాటు ఆమె తండ్రిని సైతం పోలీసులు విచారిస్తున్నారు.