05-07-2024 01:46:28 AM
ప్రధాన నిందితుడు కోసం గాలిస్తున్న పోలీసులు
ఘటన జరిగినప్పటి నుంచి పరారీలోనే భోలే బాబా
బాబా కాల్ రికార్డులు పరిశీలిస్తున్న ఖాకీలు
హత్రాస్, జూలై 4: యూపీలోని హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటతో వందల మంది కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో నిర్వాహాకులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా సత్సంగ్‌లో సేవదార్లు (వాలంటీర్లు)గా పనిచేస్తున్నారని అలీగఢ్ ఐజీపీ శలభ్ మాథుర్ తెలిపారు.
ఘటనకు సంబంధించి కీలక నిందితుడు దేవప్రకాశ్ మధుకర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశామని, అతనిపై రూ.లక్ష రివార్డు ప్రకటించినట్లు తెలిపారు. విచారణను అనుసరించిన అరెస్టులు ఉంటాయని, అవసరమైతే బాబాను సైతం ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో బాబా పాత్ర ఉందా లేదా అనే విషయంపై విచారణకు ముందే మాట్లాడటం అనవసరమని పేర్కొన్నారు. ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లోనూ లేదని, సత్సంగ్‌ను నిర్వాహాకులదే బాధ్యత అని చెప్పారు. గాయపడ్డ క్షతగాత్రులను బుధవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. కాగా, తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ అశీష్ తెలిపారు.
ఆచూకీ లేని భోలేబాబా
ఈ ఘటనతో ఇన్ని రోజులు భోలే బాబాను విశ్వసించిన భక్తులే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు తమను రక్షించే ఉద్దేశం ఉంటే వెంటనే వచ్చి తమ బాధలు విని సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తొక్కిసలాట జరిగినప్పటి నుంచి భోలే బాబా ఆచూకీ కనిపించడం లేదు. కాగా, ఘటన జరిగిన రోజు ఆయన కాల్ రికార్డులను పోలీసులు పరిశీలించారు. బాబా మధ్యాహ్నం 1.40 గంటలకు వేదిక నుంచి బయలుదేరగా.. 2.48 గంటలకు ముఖ్య సేవదార్ దేవ్‌ప్రకాశ్ మధుకర్ నుంచి కాల్ వెళ్లింది. ప్రమాద విషయం చెప్పేందుకే ఫోన్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ తర్వాత నిర్వాహాకుల్లో మహేశ్‌చంద్ర, సంజుయాదవ్, దేవ్ ప్రకాశ్ భార్య రంజనతో బాబా మాట్లాడారు. అనంతరం 4.35 గంటల తర్వాత బాబా మొబైల్ స్విచ్ ఆఫ్ చేశారని, ఆయన ఉన్న లొకేషన్‌ను గుర్తించలేకపోయామని పోలీసులు వెల్లడించారు.
వ్యతిరేక శక్తుల పనే..
హత్రాస్ సత్సంగ్‌లో తొక్కిసలాట కారణంగా 121 మంది మరణించగా 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో భోలే బాబా సంఘటనా స్థలంలో లేకపోవడంతో ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ దుర్ఘటన వెనుక వ్యతిరేక శక్తులు ఉన్నాయని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని భోలే ఓ ప్రకటన విడుదల చేశారు.