10-02-2025 07:19:24 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడి ఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ప్రకటన చేశారు. సోమవారం ఉదయం ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన వెల్లడించారు. నిందితులు ఖమ్మం, నిజామాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. 2022లో వీరరాఘవరెడ్డి 'రామరాజ్యం'ను ప్రారంభించాడని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశాడని డీసీపీ తెలిపారు.
రామరాజ్యంలో చేరితే రూ.20 వేలు జీతం ఇస్తానంటూ తణుకు, కోటప్పకొండలో వీరరాఘవ రెడ్డి పర్యటించాడు. రామరాజ్యంలో చేరిన వారంతా యూనిఫామ్ కుట్టించుకోమమన్నాడు. ఈనెల 6వ తేదీన అందరూ యాప్రాల్ లో కలిశారని రాజేంద్రనగర్ డీసీపీ వ్యాఖ్యానించారు. రామరాజ్యం బ్యానర్ తో ఫోటోలు, వీడీయోలు తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈనెల 7న మూడు వాహనాల్లో చిలుకూరు వచ్చిన వీరరాఘవ రెడ్డి తమకు ఆర్థికంగా సాయం చేయాలని రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాన అర్చకుడు రంగారాజన్ అందుకు నిరాకరించడంతో పూజారిపై దాడి చేశారని డీసీపీ వివరించారు.