14-02-2025 01:53:09 AM
* భారత సైన్యం ప్రకటన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: భారత్ సరిహద్దుల వెంట పరిస్థితి నిలకడగానే ఉందని భారత సైన్యం గురువారం ప్రకటించింది. నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంట ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరిగినట్టు వచ్చిన వార్తలను ఖండించింది.
రెండు సైన్యాల మధ్య కుదిరిన అవగాహనన ప్రకారం ఎల్‌ఓసీ వెంబడి కాల్పుల విరమణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘నియంత్రణ రేఖ వెంట కొన్ని చెదురుమొదురు కాల్పులు, ఐఈడీ పేలుడు వంటి ఘటనలతో కొంత కలకలం రేగింది. అయితే ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా పరిస్థితిని అదుపు చేశాం.
భారీ క్యాలిబర్ ఆయుధాలతో కాల్పులు జరగలేదు. ఎల్‌ఓసీ వెంబడి చిన్న చిన్న కాల్పులు సంఘటనలు జరగడం సహజమే. సరిహద్దు వెంట పరిస్థితి నిలకడగా ఉంది. నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం ఆధిపత్యం కొనసాగుతోంది’ అని ప్రకటనలో వివరించింది.
భారీ ప్రాణనష్టం అంటూ వార్తలు
జమ్ముకశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లా, కృష్ణ సెక్టార్‌లో బుధవారం రాత్రి పాక్ సైన్యం కా ల్పుల విరమణను ఉల్లంఘించిందని, అలా గే ఎల్‌ఓసీ వెంబడి తార్కుండి ప్రాంతంలో ఉన్న ఫార్వర్డ్ పోస్ట్‌పై పాక్ సైన్యం కాల్పులు జరిపినట్టు గరువారం ఉదయం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
పాకిస్థాన్ దాడిని భారత బలగాలు బలంగా తిప్పికొట్టడంతో అటువైపు భారీగా ప్రాణనష్టం జరిగిందని ఆర్మీ అధికారులు పేర్కొన్నట్టుగా వార్తలు రావడంతో భారత సైన్యం స్పందించింది. నియంత్రణ రేఖ వెంబడి భారీ స్థాయిలో కాల్పులు జరగలేదంటూ తాజా ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.
గాయపడ్డ ఆర్మీ అధికారి
జమ్ముకశ్మీర్‌లోని మెంధార్ సెక్టార్‌లో ల్యాండ్‌మైన్ పేలడంతో ఇండియన్ ఆర్మీ జూనియర్ కమిషన్డ్ అధికారి స్వల్పంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. సరిహద్దు వెంట పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తపై భారత ఆర్మీ స్పందించలేదు. మంగళవారం అఖ్నూర్ సెక్టార్‌లో ఐఈడీ పేలిన ఘటనలో కెప్టెన్ హోదా అధికారి సహా మరో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.