calender_icon.png 29 November, 2024 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్టింగ్‌ను ‘చే’ జిక్కించుకోవాల్సిందే

29-11-2024 02:31:10 AM

  1. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రత్యేక ఫోకస్ 
  2. గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ కీలక సమావేశం 
  3. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు 
  4. అభ్యర్థి ఎంపికపై చర్చ..
  5. జీవన్‌రెడ్డినే బరిలోకి దింపాలని నిర్ణయం 
  6. నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేసిన పీసీసీ 

హైదరాబాద్, నవంబర్ 28(విజయక్రాంతి): వచ్చే ఏడాది జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. సిట్టింగ్ స్థానాన్ని ‘చే’జారకుండా చూసుకోవాలని ఇప్పటినుంచే ప్లాన్ సిద్ధం చేస్తోంది. కరీంనగర్-మెదక్- అదిలాబాద్- నిజామామాద్ గ్రాడ్యుయేట్స్ స్థానం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

ఆయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగుస్తుంది. ఈ స్థానం నుంచి తిరిగి కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించుకోవాలనే పట్టుదలతో పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్  గురువారం నాలుగు ఉమ్మడి జిల్లాల నాయకులు, ఇన్‌చార్జి మంత్రులతో సమావేశం నిర్వహించారు.

సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామని, ఇప్పుడు అధికారంలో ఉన్నందున కచ్చితంగా గెలువాల్సిందేనని పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

ఓటర్ల గడువు నమోదు డిసెంబర్ 9వ తేదీ వరకు కేటాయించినందున తమ అనుచరులతో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఎమ్మెల్యేలకు పీసీసీ చీప్ సూచించారు. ఎక్కువ మంది పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, అందుకు జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను కూడా నియమించాలన్నారు. బీఆర్‌ఎస్ నేతలు చేసే తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సూచించారు. 

ఎమ్మెల్సీ పరిధిలో 42 నియోజక వర్గాలు: జీవన్‌రెడ్డి 

పట్టభద్రుల అభ్యర్థి ఎంపిక వ్యూహాలను సమావేశంలో చర్చించామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం గాంధీభవన్‌లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీతో కలిసి మీడియాతో మాట్లాడుతూ నాలుగు ఉమ్మడి జిల్లాలలో పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లో 53 వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలిచిందని చెప్పారు. అయినా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలనే దానిపై సమావేశంలో చర్చించామని వెల్లడించారు.త్వరలోనే అభ్యర్థిపై నిర్ణయం ఉంటుందని, తనను కూడా పార్టీ సంప్రదించిందని జీవన్‌రెడ్డి చెప్పారు. 

మళ్లీ జీవన్‌రెడ్డి పోటీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డినే తిరిగి పోటీ చేయించాలని సమావేశంలో తీర్మానం చేశామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి పంపుతామని, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని  తెలిపారు. ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్‌ను ఎన్‌రోల్ చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.