calender_icon.png 18 October, 2024 | 7:58 PM

భయపడుతూనే గేదెపైకెక్కి కూర్చున్నా..

26-07-2024 12:05:00 AM

విక్రమ్ కథానాయకుడిగా వైవిధ్యమైన కథతో తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన హీరోయిన్ మాళవిక మోహనన్ కొన్ని ఇంటర్వ్యూల్లో ‘తంగలాన్’ విశేషాలు, చిత్రీకరణ టైంలోని తమాషా ముచ్చట్లను పంచుకుంది. “ఒక రోజు నేను సెట్‌కు వెళ్లేసరికి పెద్ద గేదె ఉంది.

డైరెక్టర్ నాకు ఆ గేదెను చూపిస్తూ ‘ఎక్కగలవా?’ అని అడిగారు. ఏదో సరదాగా అన్నారేమో అనుకొన్నా. మేకప్ వేసుకొచ్చిన తర్వాత గేదెపై కూర్చోమని చెప్పారు. ‘నేనెప్పుడూ గేదెపైకి ఎక్కలేదు’ అని చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆయన వినలేదు సరి కదా, ‘షూటింగ్ మొదలెట్టాలి.. గేదెపై కూర్చో...’ అని సూచించారు. ఇక, భయంతోనే దానిపైకి ఎక్కి కూర్చున్నా’. అసలు అలాంటి సన్నివేశం ఉంటుందని దర్శకుడు ముందుగా నాకు చెప్పనేలేదు. అందుకే ఒక్కసారిగా ఆశ్చర్యపోయా” అని తెలిపింది.

సినిమాలో మిగతా నటీనటుల్లాగే డీ గ్లామరైజ్ పాత్ర లో కనిపించనున్న మాళవిక చిత్రబృందంతో కలిసి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను ‘ఈ సినిమా కోసం 5 గంటలు మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. ఒక్కో రోజైతే దాదాపు 10 గంటల పాటు మేకప్‌లోనే ఉన్నా. ఫలితంగా స్కిన్ ఎలర్జీ వచ్చింది. దీంతో చర్య వ్యాధుల నిపుణులు, కంటి వైద్యుల చుట్టూ తిరగక తప్పలేదు.. ఇలా ఐదుగురు డాక్టర్లను కలిశా” అని చెప్పు కొచ్చింది మాళవిక.