calender_icon.png 25 November, 2024 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూరొండటం అంత వీజీ కాదు!

28-09-2024 12:11:05 AM

వెజిటెబుల్స్ వెరీ కాస్ట్లీ.. గురూ!

  1. ధరల దెబ్బకు సామాన్యుడు విల విల
  2. టామాటా, ఉల్లిపాయ ధరలు పైపైకి..
  3. ఏ కూరగాయ కొందామన్నా కిలో రూ.60కి పైమాటే..
  4. పండుగ సమీపిస్తున్న వేళ ధరలకు రెక్కలు

టమాటా ‘ఠా’రెత్తిస్తున్నది. ఉల్లి కంట నీరు తెప్పిస్తున్నది. కాకర మరింత చేదెక్కింది. పచ్చిమిర్చి ఘాటు నషాళానికెక్కుతున్నది. వంకాయ చేతికి అందనంటున్నది. సొరకాయ కొండెక్కి దిగి రానంటున్నది. ‘క్యా రేట్ హే’.. అన్నట్లు క్యారెట్ రేట్ పెరిగింది.

వరుసగా కురుస్తున్న వానలకు పంట దెబ్బతినడం, డిమాండ్‌కు తగినట్లు కూరగాయల సాగు లేకపోవడంతో ప్రస్తుతం ధరలు అమాంతం పెరిగాయి. డిమాండ్ ఎక్కువ.. సప్లు తక్కువగా కావడంతో ఒక్కో కూరగాయ ధరకు రెక్కలు వచ్చి సామాన్యుడి చేతికి చిక్కనంటున్నాయి.      

వికారాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి) : ఇటీవల కురుస్తున్న వర్షాలకు పంట నీట మునగడం, కొంత కుళ్లిపోవడం, పురుగు పట్టడంతో మార్కెట్‌కు డిమాండ్ తగిన కూరగా యలు, ఆకుకూరలు రావడం లేదు. రైతులు చేతికొచ్చిన పంటను అష్టకష్టాలు పడి మార్కెట్‌కు తరలిస్తున్నారు. అప్ప టికీ టోకు వ్యాపారులకు మార్కెట్‌కు వచ్చిన కూరగాయలు చాలడం లేదు.

దీంతో వారు పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటు న్నారు. ఫలితంగా వారిపై రవాణా చార్జీలు, కూలీ చార్జీలు అదనంగా పడుతున్నాయి. దీంతో వారు అనివార్యంగా కూరగాయల ధర లు పెంచాల్సిన పరిస్థితి. వారి వద్ద నుంచి రిటైల్ వ్యాపారులు వెజిటెబుల్స్ తెచ్చుకునే సరికి ధరలు మరింత పెరుగుతున్నాయి. 

 ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి..

కూరగాయల దిగుబడి పెద్దగా లేకపోవడంతో కమిషన్ ఏజెంట్లు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దిగుబడి చేసుకుంటున్నారు. ఏపీలోని కర్నూల్, అనంతపురంతో పాటు , హైదరాబాద్ నుంచి ఎక్కువగా వెజిటెబుల్స్ తీసుకొస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి కొంతమేర దిగుమతి ఉన్నా, అది డిమాండ్‌కు ఏ మాత్రం సరిపోవడం లేదు.

కమిషన్ ఏజెంట్ల వద్ద వ్యాపారులు కూరగాయలకు  ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేసి రైతు బజారులో రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. బీన్స్, క్యాప్సికం వంటి కూరగాయ లు కిలో రూ.80కి పైగానే పలుకుతున్నాయి. వ్యాపారులు గతంలో ఆకు కూరలు రూ.10కి రెండు కట్టలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రూ.20కి మూడు కట్టలు మాత్రమే ఇస్తున్నారు.

ఆకు కూరల ధరలు రైతు బజారు బోర్డుపై ఒక రేటు ఉండగా, వ్యాపారులు, రైతులు మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తునానరు. అక్కడి సిబ్బంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కూరగాయలు, ఆకు కూరల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు పచ్చడి మెతుకులకు పరిమితమవుతున్నారు. 

కూరగాయల సాగు తక్కువ..

జిల్లాలో కూరగాయల సాగు పెద్దగా లేదు. దీంతో డిమాండ్‌కు తగినట్లు సప్లు లేకపోవడంతో దళారులు ధరలను పెంచేస్తున్నారు. ఇక్కడి రైతులు అత్యధికంగా బోరు బావులపై ఆధారపడే పంటలు పండిస్తారు. నవాబుపేట్, పూడూరు, వికారాబాద్, మోమిన్‌పేట్, మర్పల్లి, పరిగి వంటి మండలాల్లోనే కూరగాయల సాగు కాస్త ఎక్కువగా ఉంటుంది.

రైతులు ప్రధానంగా టమాటా, వంకాయ, బెండ, బీర, దొండ, చిక్కుడు, ఉల్లి, పచ్చిమిర్చి, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ వంటి పంటలు ఎక్కువగా పండిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆకుకూరలు పండిస్తున్నారు. నవాబుపేట్, వికారాబాద్, పూడూరు మండలాలకు చెందిన రైతులు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలను హైదరాబాద్ లో ప్రముఖ మార్కెట్, రైతుబజార్లకు తరలిస్తుంటారు. సన్నకారు రైతులు మాత్రం తాము పండించే కూరగాయలను స్థానిక మార్కెట్లకు తరలిస్తారు. లేదంటే వారే సొంతంగా విక్రయిస్తారు.

పచ్చడి మెతుకులే గతి

ప్రస్తుతం ఏ వినియోగదారుడు ఏ కూరగాయలు కొందామన్నా కిలో రూ.60 చిలుకు మాటే. వారం పది రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. వంటలో ఎక్కువగా వాడే టమాటా, ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యుడు చిన్నబోతున్నాడు. దసరా పండుగ, బతుకమ్మ వేడుకలు దగ్గర పడుతున్న వేళ కేవలం పచ్చడి మెతుకులకు పరిమితమవుతున్నాడు.