calender_icon.png 28 September, 2024 | 4:57 AM

గడువులోగా సీతారామ పూర్తి చేయాలి

28-09-2024 02:59:45 AM

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

టెండర్ల ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత గడువులోగానే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టన్నెల్, కాలువల నిర్మాణ పనుల పురోగతిపై శుక్రవారం జలసౌధలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. భూసేకరణ అంశంపై అలసత్వం వహించవద్దని సూచించారు.

ఇందుకు అనుగుణగా పాలనాపరమైన అనుమతుల్లో జాప్యం లేకుండా చూసుకోవాలని తెలిపారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాంకేతికాంశాల్లో అధికారులు పరస్పరం సమన్వయం చేసుకోవాలని సూచించారు.

సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీలు అనిల్‌కుమార్, నాగేందర్‌రావు, సీతారామ ప్రాజెక్టు సీఈ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా సీఈ విద్యాసాగర్ పాల్గొన్నారు.