calender_icon.png 26 March, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ సంబంధాల నేపథ్యంలో ‘సీతన్నపేట గేట్’

25-03-2025 11:34:22 PM

వేణుగోపాల్, ‘8పీఎం’ సాయికుమార్, పార్థు, రఘుమారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘సీతన్నపేట గేట్’. ఈ చిత్రాన్ని వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్‌ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వై రాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో రూపొందిన ఈ సినిమాలో యశ్వన్, గంగాధర్, సురభి తివారి, కస్లాయ్ చౌదరి, అనూష జైన్, సుదీక్ష ఝా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎన్‌ఎస్ ప్రసు సంగీతం సమకూర్చగా, ఎడిటింగ్ బాధ్యతలను శివ శర్వాణి నిర్వర్తించారు.

భాస్కరభట్ల, మణికంఠ సంకు లిరిక్స్ రాయగా, యాక్షన్ సన్నివేశాలకు వింగ్‌చున్ అంజి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 4న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోందీ సినిమా. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో సమావేశమై, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న టాలీవుడ్ దర్శకుడు వీ సముద్ర మాట్లాడుతూ.. “ఆర్‌ఎస్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద సంస్థ. ఎన్టీఆర్‌తో ‘సుబ్బు’, నా దర్శకత్వంలో అనుష్క, శ్రీహరి, సుమంత్ కాస్టింగ్‌తో మహానంది మూవీ చేశారు. నిర్మాత శ్రీనివాస్ కన్నడలో స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించారు. అలాంటి సంస్థ నుంచి ‘సీతన్నపేట గేట్’ సినిమా వస్తోంది.

ఇప్పుడున్న ట్రెండ్‌కు సరిపోయేలా మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిందీ సినిమా” అన్నారు. డైరెక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పినట్లు మన సమాజంలో చాలావరకు మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగానే ఉంటున్నాయి. కొన్నిసార్లు ఇవి అక్రమ సంబంధాలుగా మారుతున్నాయి. ఇలాంటి కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిందే మా ఈ సినిమా. ఆద్యంతం ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్స్‌తో ఈ సినిమా కథనం సాగుతుంది” అని చెప్పారు.  నిర్మాత ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు థియేటర్లకు పెద్దగా ప్రేక్షకులు రావడం లేదు అంటున్నారు. కానీ సగటు మధ్యతరగతి, పేదవారికి ఇప్పటికీ చవకైన వినోదం సినిమానే.

సినిమాలకు పెద్దా చిన్నా అనేది లేదు. కంటెంట్ బాగుండాలి. కంటెంట్ లేని సినిమా వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినా అది ప్రేక్షకులకు నచ్చదు. కథ బాగుంటే చిన్న సినిమాలు కూడా ఆదరణ పొందుతాయి. సీతన్నపేట గేట్ సినిమా కథ డైరెక్టర్ రాజ్‌కుమార్ చెప్పగానే ఆకట్టుకుంది. మంచి కంటెంట్ ఈ సినిమాలో ఉంది” అని తెలిపారు.  హీరో వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘సీతన్నపేట గేట్ సినిమాలో నేను హీరోగా నటించాను. ఇందులో నేను చాలా మాస్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్‌లో కనిపిస్తాను. చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతానని ఆశిస్తున్నా” అన్నారు. 

“వందల ఏళ్ల క్రితమే కార్ల్ మార్క్స్ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే అని చెప్పాడు. కానీ ఈ కథలో ఈ ఆర్థిక సంబంధాలు కొన్ని సందర్భాల్లో అక్రమ సంబంధాలుగా ఎలా మారుతున్నాయో దర్శకుడు చూపించారు. ఇవాళ్టి యువత ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే మంచి మెసేజ్ కూడా అంతర్లీనంగా కథలో ఉంటుంది” అని మాటల రచయిత బయ్యవరపు రవి తెలిపారు. ఇంకా నటుడు కట్టప్ప, డీవోపీ యోగిరెడ్డి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.