calender_icon.png 7 April, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణ వైభోగమే....!

06-04-2025 03:26:45 PM

నియోజకవర్గంలో అట్టహాసంగా సీతారాముల కళ్యాణ వేడుకలు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో శనివారం సీతారాముల కల్యాణ మహోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పలు గ్రామాలల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. బెల్లంపల్లి లోని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు సతీష్ వేదమంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. బుగ్గలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, మండల సీనియర్ కాంగ్రెస్ కారుకూరి రామ్ చందర్ తో పాటు కమిటీ సభ్యులు, అన్నదాన ట్రస్ట్ సభ్యులు, హనుమాన్ భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బెల్లంపల్లి బస్తీలోని శ్రీరామ భజన మందిర్ దేవాలయంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కాశిరెడ్డిపల్లి గ్రామంలో కోదండ రామాలయం, టేకుల బస్తీలోని రామాలయం, రైల్వే స్టేషన్ రామాలయం, కన్నాల బస్తి పంచముఖి హనుమాన్ దేవాలయం,మండలంలోని ఆకెనపల్లి హనుమాన్ దేవాలయాల్లో ఉదయం 11:35 గంటలకు సీతారాముల కళ్యాణాన్ని అట్టహాసంగా జరిపారు. బెల్లంపల్లి మండలంలోని పలు గ్రామాలలోని హనుమాన్ దేవాలయాల్లో మాల ధారణ భక్తులు సీతారాముల కళ్యాణ వేడుకలను వైభవోపేతంగా జరుపుకున్నారు. నెన్నెల్ మండలంలోని అభయాంజనేయ స్వామి దేవస్థానం నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక పూజలు చేశారు. కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి, తాండూర్, కాసిపేట మండల లోని పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.