06-04-2025 06:46:21 PM
పలుచోట్ల పాల్గొన్న ఎమ్మెల్యేలు..
గ్రామ గ్రామాన శ్రీరామ నవమి వేడుకలు..
తలంబ్రాలు ఒడిబియ్యం పట్టు వస్త్రాలు సమర్పించిన భక్తులు..
కామారెడ్డి (విజయక్రాంతి): సీతారాముల కళ్యాణం చూతము రారండి అంటూ శ్రీరామ నవమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పలుచోట్ల స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో సీతారామ కళ్యాణం, రామాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంకష్టహర మహా గణపతి ఆలయంలో ఎన్జీవోస్ కాలనీలోని సీతారామాంజనేయ ఆలయంలో దేవునిపల్లిలోని రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో సీతారామ కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించారు. అడ్లూరు ఎల్లారెడ్డి, లింగాపూర్, చిన్న మల్లారెడ్డి, రామేశ్వర్ పల్లి, అడ్లూరు, రామారెడ్డి, తాడ్వాయి, భిక్కనూర్, దోమకొండ, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, చుక్కాపూర్, రెడ్డిపేట్, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, నాగిరెడ్డిపేట్, తదితర మండల కేంద్రాల్లో ఘనంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు.
వేద పండితుల మంత్రోత్సవాల మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా భక్తులు నిర్వహించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి, సీతాయిపల్లి ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, గాంధారి, రామారెడ్డి లలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సీతారామచంద్రుల కళ్యాణంలో పాల్గొన్నారు. బాన్సువాడ లోని శ్రీరామ కాలనీ రామాలయం, దేశాయిపేట్ రామాలయం, కొల్లూరు రామాలయం తిరుమలపూర్, బీర్కూర్ రామాలయాలతో పాటు పోచారం స్వగ్రామం లోని రామాలయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన సతీమణి పుష్పతో కలిసి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం అచ్చంపేటలోని రామాలయంలో పట్లోళ్ల కిషోర్ కుమార్ రెడ్డి పట్టు వస్త్రాలను స్వామివారిలకు పంపించారు. మద్నూర్, పెద్ద కొడపుగల్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, మండలాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు.
సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించిన సీతారామా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను తిలకించారు. కళ్యాణోత్సవంలో సీతారాముల విగ్రహాలకు తలంబ్రాలు పోశారు. మహిళలు ఓడి బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా భక్తులు సీతారాముల కళ్యాణం ఉత్సవాలు పాల్గొని తరించారు.