06-04-2025 07:26:59 PM
హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా..
మందమర్రి (విజయక్రాంతి): శ్రీ సీతారాముల కళ్యాణం మండలంలోని గ్రామాల్లో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని పంచముఖి ఆంజనేయ ఆలయం సమీపంలోని మిథిల స్టేడియంలో, మూడవ జోన్ రామచంద్ర స్వామి ఆలయంలో, రామన్ కాలనీ హనుమాన్ ఆలయంలో, మారుతి నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో, నార్లపూర్ కోదండ రామాలయంలో, యాపల్ రామాలయంతో పాటు మండలంలోని చిర్రకుంట, పొన్నారం, ఆదిల్ పేట, తదితర గ్రామాల్లోని హనుమాన్, రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణంలోని పలు ఆలయాల్లో నిర్వహించిన సీతారామచంద్ర స్వామిల కళ్యాణానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పంచముఖి హనుమాన్ ఆలయం ఆధ్వర్యంలో....
పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలోని మిథిల స్టేడియంలో నిర్వహించిన సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రామగుండం కమిషనర్ పోలీస్ అంబర్ కిషోర్ ఝూ ప్రత్యేకంగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణానికి హాజరైన ఎమ్మెల్యే, సీపీ లను ఆలయ పురోహితుల వేద మంత్రాల నడుమ ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అభిజిత్ లగ్న సుముహూర్తమున స్వామి వార్ల కళ్యాణం జరిపించారు. కల్యాణాన్ని తిలకించేందుకు పట్టణంతో పాటు పలు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంచనీయ ఘటనలు సీఐ శశిధర్ రెడ్డి నేతృత్వంలో ఎస్సై రాజశేఖర్ బందోబస్తు నిర్వహించారు.