calender_icon.png 30 September, 2024 | 6:04 AM

3 బృందాలుగా సిట్ దర్యాప్తు

30-09-2024 01:59:47 AM

  1. తిరుపతి లడ్డూ కల్తీలో లోతైన విచారణకు సిద్ధం
  2. అన్ని ప్రాంతాలకు వెళ్లి ఆరా తీయనున్న అధికారులు

తిరుపతి, సెప్టెంబర్ 29: తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తామని సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపా ఠి స్పష్టం చేశారు. నెయ్యి కల్తీ వివాదంపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు సిట్‌కు బదిలీ అయిందని, నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీని విచారిస్తాని వెల్లడించారు.

ఈ వ్యవహారంలో అందరినీ విచారిస్తామని, నివేదిక సమర్పణకు కాలపరిమితి లేదని వివరించారు. ఈ వివాదంపై రెండో రోజు సిట్ విచారణ కొనసాగుతోన్న సందర్భంగా తిరుపతి పోలీస్ అతిథి గృహంలో మరోసారి సిట్ సభ్యులు భేటీ అయ్యారు. 3 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టనున్నట్లు త్రిపాఠి తెలిపారు. డీఐజీ గోపినాథ్ జెట్టీ, ఎస్పీ హర్షవర్ధన్, ఏఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం టీటీడీ ఈవో శ్యామలారావును కలిసి వివిధ వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.

అన్ని అంశాలపై ఆరా

కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సభ్యులు అందుకు సంబంధించిన వివిధ ప్రాంతాలకు వెళ్లి విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని దుండిగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థను పరిశీలించనున్నారు. తిరుమలలో లడ్డూ వంటశాల పోటు, విక్రయ కేంద్రాలను మరో బృందం తనిఖీ చేస్తుంది. టీటీడీ పాలన భవనంలో మరో బృందం విచారిస్తుంది.