- చినుకు పడిన క్షణం నుంచి ప్రజల్లోనే ఉన్నాం
- ముందస్తు చర్యల వల్లే ప్రాణ నష్టం తగ్గింది
పదేళ్లు డిజాస్టర్ మేనేజ్మెంట్‌ను నిర్లక్ష్యం చేశారు
రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్/ఖమ్మం, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): 2022లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలు వచ్చిన సమయంలో నాడు ప్రజల దృష్టిని మళ్లించడానికి వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి అది క్లౌడ్-బరస్ట్, విదేశీ కుట్ర అంటూ మతిలేని ప్రకటనలు చేసిన బీఆర్‌ఎస్ నాయకులకు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత ఎక్కడిదని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. వరదలపై ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను పొంగులేటి ఖండించారు.
ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నాడు విదేశీ కుట్ర అని ఫాంహౌస్ దాటని బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలు.. నేడు వరదల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నాడు ప్రకృతిపరంగా కురిసిన వర్షాలను కూడా కుట్రకోణంలో చూసిన హరీశ్‌రావు.. ఇప్పుడు వచ్చిన వర్షాలను కుట్ర కోణంలోనే చూస్తున్నారా? అని అడిగారు. వరద కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించడానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గడప దాటడం లేదని విమర్శించారు. పదేండ్ల పాలన అనుభవంతో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒక సలహానో, సూచనో చేస్తారని భావించామని, ఆయన పెదవి కూడా విప్పక పోవడం దురదృష్టకరమని అన్నారు.
ఆయన కొడుకు కేటీఆర్ అమెరికాలో ఉండి, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియకుండా, అజ్ఞానంతో ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. ఆయన ఎందుకు అమె రికా వదిలి రావడం లేదని ప్రశ్నించారు. గత పదేళ్లలో విపత్తుల నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో ఊహించని నష్టం వాటిల్లిందని స్పష్టంచేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమన్వయంతో పనిచేయడం వల్లే ఖమ్మంలో ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని ఉద్ఘాటించారు.
సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్వయంగా ఖమ్మం జిల్లాలో పర్యటించి, పరిస్థితిని అంచనా వేసేందుకు ఇక్కడే బసచేశారని గుర్తుచేశారు. గతంలో ఖమ్మం జిల్లాలో వరదలు వస్తే రూ.౧౦వేల చొప్పున సహాయం చేస్తామని చెప్పి చేతులెత్తేసిన బీఆర్‌ఎస్ నాయకులు.. ఇప్పుడు రూ.౫౦ వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ బురద రాయకీయాలను మేము పట్టించుకోవడం లేదన్నారు.
ఎవ్వరూ అధైర్యపడొద్దు.. అందర్నీ ఆదుకుంటాం
ఎవ్వరూ అధైర్యపడొద్దని, బాధితులందర్నీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. ఖమ్మం రూర ల్ మండలంలోని తీర్ధాల, రామన్నపేట, దానవాయిగూడెం, నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం, కట్టుకాచారం, రామచంద్రాపురం, సుర్ధేపల్లి గ్రామాల్లో బుధవారం పొంగులేటి పర్యటించారు. ఈ సందర్బంగా రోడ్ల మరమ్మతులు, తక్షణ సాయం, బాధితుల వివరాల సేకరణపై అధికారులకు సూచనలు చేశారు. సర్వే ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఆదేశించారు. సర్టిఫికెట్లు, పుస్తకాలు నష్టపోయిన వారికి కూడా తగు సహాయం చేస్తామన్నారు. తడిసిన బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తామన్నారు. విద్యుత్ స్తంభాలు, తీగల మర మ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు.
అశ్వినీ కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత
కారేపల్లి మండలం గంగారాంతండాకు చెందిన మోతీలాల్, ఆయన కుమార్తె యువ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినీ వరదల్లో కారు సహా కొట్టుకుపోయి మృతి చెందగా, వారి కుటుంబాన్ని బుధవారం మంత్రి పరామర్శించారు. ఒకరికి రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. వీరి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, పత్రాన్ని అందజేశారు. అశ్వినీ మరణంతో దేశం, రాష్ట్రం ఒక యువ శాస్త్రవేత్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో వరదల్లో మృతిచెందిన షేక్ యాకూబ్, సైదాబీ దంపతుల కుటుంబాన్ని పరామర్శించి, రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో చెక్కులను వారి కుమారులు ఎస్‌కే యూసూఫ్, షరీఫ్‌కు అందజేశారు. మృతుల కుటుంబం కోరిక మేరకు కూసుమంచిలో ఇంటి స్ధలం కేటాయిస్తామని హామీఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.