calender_icon.png 30 September, 2024 | 3:51 PM

లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు

28-09-2024 01:40:46 AM

  1. 9 మంది సభ్యులతో దర్యాప్తు బృందం
  2. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

విజయవాడ, సెప్టెంబర్ 27: తిరుమల లడ్డూ వివాదంపై విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. గుంటూరు రేంజ్ ఐజీపీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి నేతృత్వంలో 9 మంది సభ్యులను సిట్‌లో భాగం చేశారు. తిరుమలలో వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన ఇతర అక్రమాలపైనా సిట్ దర్యాప్తు చేస్తుందని ప్రభు త్వం తన ఉత్తర్వుల్లో వెల్లడించింది.

సిట్ దర్యా ప్తు సమయంలో ప్రభుత్వంలోని ఏదైనా శాఖ నుంచి కావాల్సిన సమాచారం పొందవచ్చు. ఏదైనా సహాయం కోసం ఎవరినైనా పిలవవచ్చు. అన్ని ప్రభుత్వ విభాగాలు సిట్ విధుల నిర్వహణలో సహకరిస్తాయి. సమాచారం, సాంకేతిక సాయం కోసం పిలిస్తే అన్ని శాఖలు సక్రమంగా సమర్పించాలి.

డీజీపీ అనుమతితో బయటినుంచి నిపుణుల సాయం పొందవచ్చు అని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొ ంది. తిరుమల లడ్డూ నాణ్యతపై గతవారం ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలతో వివాదం మొదలైంది. నెయ్యిలో జంతువుల నూనెలు ఉన్నాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.    

9 మంది సభ్యులు వీరే

ఐజీపీ త్రిపాఠితో పాటు సిట్ బృందంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, కడప ఎస్పీ వీ హర్షవర్ధన్‌రాజు, తిరుపతి ఏఎస్పీ వెంకట్‌రావు, డీఎస్పీలు జీ సీతారామరావు, జే శివనారాయణస్వామి, కల్లూరు సీఐ సూర్యనారాయణ, ఇన్‌స్పెక్టర్లు సత్యనారాయణ, ఉమామహేశ్వర్ ఉన్నారు.