- కోహీర్లోనూ 9.9గా నమోదు
- దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- గతేడాదితో పోలిస్తే 10 డిగ్రీలు తగ్గుదల
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాలోని సిర్పూర్లో ఆదివారం కనిష్ఠంగా 9.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా.. గతేడాది నవంబర్ 24న 20.3 డిగ్రీలుగా నమోదవగా ఈసారి ఏకంగా పది డిగ్రీలు తగ్గింది. మిగతా జిల్లాల్లోనూ గతేడాది మించి చలి తీవ్రత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా కోహీర్లో ఆదివారం 9.9 డిగ్రీలు నమోదు కాగా.. గతేడాది ఇదే రోజున 19.8 డిగ్రీలుగా ఉన్నట్లు అధికారులు చెప్తుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో 10.1 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మారపల్లిలో 11.1 డిగ్రీలు, మెదక్ జిల్లా శివంపేటలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.