హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): సిరివెన్నెల సీతారామ శాస్త్రి జీవితం స్ఫూర్తిదాయకమని హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్‌రెడ్డి పేర్కొన్నారు. విశ్వనాథ సాహిత్య పీఠం ద్విశతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ అమీర్‌పేటలోని సీఈఎస్‌ఎస్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సాహితీ వైభవాన్ని పలువురు జ్ఞాపకం చేశారు.
ఈ సందర్భంగా ‘సిరివెన్నెల’సోదరుడు చేంబోలు శ్రీరామశాస్త్రి రాసిన ‘పూర్ణత్వపు పొలిమేరలో’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ భారతీయతను, మానవీయతను, విప్లవాత్మకతను తనదైన శైలిలో, పద సౌందర్యంతో సిరివెన్నెల సీతారామశాస్త్రి తన కలం నుంచి చక్కటి పాటలను జాలువారించారన్నారు. తెలుగువారి గుండెల్లో తన స్థానాన్ని పదిల పర్చుకున్నారని చెప్పారు.
కొవిడ్ కాలంలో దొరికిన విశ్రాంత సమయాన్ని సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ చరిత్రనంతా 58 కవితలుగా మాత్రా చందస్సులో ‘మేఘమథనం’ పేరిట కావ్యా న్ని రాసినట్లు చెప్పారు. ఆ పుస్తకానికి సిరివెన్నెల ముందుమాట రాస్తానన్నారని చెప్పా రు. విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ వెల్చాల కొండలరావు సమర్పణలో ముద్రితమైన ఈ చిరు పుస్తకం సిరివెన్నెల వ్యక్తిత్వాన్ని క్లుప్తంగా తెలియజేసిందని అభివర్ణించారు.