- సిరిసిల్లలో నేతన్నల వరుస ఆత్మహత్యలు
- 8 నెలల్లోనే 12 మంది కార్మికుల సూసైడ్
- ఆర్థిక ఇబ్బందులే కారణం
- ఇంటి పెద్ద లేక వీధిన పడుతున్న కుటుంబాలు
సిరిసిల్ల, నవంబర్ 16 (విజయక్రాంతి): కార్మిక, ధార్మిక క్షేత్రాలుగా పేరొందిన సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యల పరంపరా కొనసాగుతోంది. సిరిసిల్ల కాస్త ఉరిశాలగా మారుతుందానే ఆందోళన కల్గిస్తోంది. కేవలం ఎనిమిది నెలల్లోనే 12 మంది నేతన్నలు బలవనర్మణాలకు పాల్పడ్డారు.
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొంత కాలంగా చేతి నిండా పనిలేకపోవడంతో చిన్న చిన్న అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకునే పరిస్థితి నెలకొంది.
ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న సమయంలో అప్పుల వారి వేధింపులు తీవ్రం కావడంతో తీర్చే పరిస్థితులు నేతన్నకు కనిపించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమైక్యాంధ్ర పాలనలో కనిపించిన నేతన్నల చావు కేకలు మళ్లీ ప్రారంభమయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆగిన బతకుమ్మ చీరల ఆర్డర్లు
సిరిసిల్ల జిల్లాలో 30 వేల 352 మరమగ్గాలు వస్త్ర ఉత్పత్తులు చేసేవి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక బతుక్మ చీరల తయారీలో నాణ్యత లేదని వాటి ఆర్డర్లను నిలిపివేసింది. దీంతో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకుపోయి, దాదాపు 15 వందలకు పైగా మరమగ్గాలు మూలకు పడ్డాయి. కొన్నింటిని తుక్కు కింద అమ్ముకున్నారు. వస్త్ర పరిశ్రమపై వాటి అనుబంధ పరిశ్రమలపై దాదాపు 20 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.
ఆత్మహత్య చేసుకున్న నేతన్నలు
చేతినిండా పని లేకపోవడంతో ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఈ ఏడాది ఫిబ్రవరి 11న తడుక శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 6న సిరిపురం లక్ష్మినారాయణ బలవనర్మణానికి పాల్పడ్డాడు. ఏప్రిల్ 25న అంకారపు మల్లేశం (తంగళ్లపల్లి) ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏప్రిల్ 25న అడిచేర్ల సాయికుమార్, జూన్ 21న కుడి క్యాల నాగరాజు, జూన్ 25న ముదికొండ నరేష్ (తంగళ్లపల్లి), జూలై 1న గూడూరి విష్ణుప్రసాద్, జూలై 2న పల్లె యాదగిరి, ఆగస్టు 27న జక్కని సతీశ్, అక్టోబర్ 19న ఆడెపు సంపత్, నవంబర్ 9న బైరి అమర్, నవంబర్ 13న ఎర్రం కొమురయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 9న బైరి అమర్, స్రవంతి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బతుకు దెరువు కోసం వలస వచ్చిన అమర్ సొంతంగా వస్త్ర వ్యాపారం చేయాలనే లక్ష్యంతో బెడ్ షీట్లు, నాప్‌కిన్స్‌లు తయారు ప్రారంభించారు. కానీ వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లడంతో చేసిన దాదాపు రూ.95 లక్షల అప్పులు, మైక్రో ఫైనాన్స్‌లు, యాప్‌ల వారి వేధింపులు తీవ్రం కావడంతో ఇంట్లోనే ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గత ప్రభుత్వ చర్యలతోనే..
గత ప్రభుత్వంలోనే వస్త్ర పరిశ్రమలోని ఆసాములకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని, కార్మికుల సంక్షేమానికి ఒక్క పథకం తీసుకురాలేదని కార్మికులు వాపోతున్నారు. వర్క్ టూ ఓనర్ పథకం తీసుకువచ్చినా ఆచరణలో పెట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కార్మికుడికి త్రిప్టు(పొదుపు) పథకం అమలులో గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే కార్మికుల చావులకు కారణమని పలువురు నేత కార్మికులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం నేత కార్మికుల ఆత్మహత్యలను దృష్టిలో పెట్టుకోని గత ప్రభుత్వంలో వస్త్ర పరిశ్రమకు ఉన్న అప్పుల్లో దాదాపు రూ.200 కోట్ల అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది.
బతుకమ్మ చీరల తయారీలో స్వశక్తి మహిళలకు ఏడాదిలో రెండు చీరల చొప్పున అందజేసేందుకు రూ.1.30 కోట్ల చీరలు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అదేవిధంగా వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం అందించే విద్యుత్ రాయితీని 25 నుంచి 50 శాతంకు పెంచింది.
పని లేక పస్తులున్నాం
సాంచేలు మూతపడటంతో పనులు లేక, తినిడానికి తిండిలేక పస్తులున్నాం. తన కాలుకు దెబ్బతగలడంతో కూలీపనులకు పోయిన. కాలు మంచిగా లేదని పనులు ఎవ్వరూ ఇవ్వలేదు. నాకు పక్షపాతం వచ్చి మంచం పట్టినా. నా గోళీలకు పైసలు లేక నా భర్త లక్ష్మినారాయణ అప్పులు చేసిండు. పనులు లేక పైసల్ లేకపోవడంతోపాటు ఉన్న ఇల్లు కూలిపోయేందుకు ఉండగా, మనస్థాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. మాకు రేషన్ కార్డు, అంత్యోదయ కార్డు ఇప్పించాలి.
సిరిపురం వజ్రవ్వ (లక్ష్మినారాయణభార్య)
ప్రాణం కంటే సమస్యలు చిన్నవి
ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలి. ప్రాణం కంటే సమస్యలు ఏమీ పెద్దవి కావు. ఇంటి పెద్ద ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబం వీధిన పడుతుంది. క్షాణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో నేత కార్మికులు కుటుంబాలు ఆగమవుతున్నాయి. నేత కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం, అధికారులు సిద్ధంగా ఉన్నారు. సమస్యలుంటే నేరుగా తమ వద్దకు వచ్చి పరిష్కరించుకోవాలి. ఆత్మహత్యలకు పాల్పడవద్దు.
సాగర్, ఏడీ నేత జౌళి శాఖ,
రాజన్న సిరిసిల్ల జిల్లా