calender_icon.png 5 December, 2024 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరిసిల్ల టు కాకినాడ!

04-12-2024 12:28:49 AM

  1. జిల్లా నుంచి నేరుగా పోర్టుకు తరలుతున్న ధాన్యం
  2. గ్రామాల్లో చక్రం తిప్పుతున్న వ్యాపారులు
  3. దళారులను నియమించుకుని దందా
  4. ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా చెల్లింపులు
  5. రైతులకు లాభదాయకమే అయినా.. మోసం జరిగితే జవాబుదారీ ఎవరు?

సిరిసిల్ల, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా ప్రకటించింది. గ్రేడ్-1 క్వింటా ధాన్యానికి రూ.2,320, గ్రేడ్-2 రకానికి క్వింటాకు రూ.2,130 ప్రకటించింది. కానీ, రైతులు వ్యయప్రయాసలకోర్చి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువెళ్లిన తర్వాత, నిర్వాహకులు తేమ పేరిట కొర్రీలు పెడుతుండడం, తరుగు పేరిట బస్తాకు 2.50 కిలోలను తగ్గిస్తుండడంతో రైతులు దళారుల వైపు చూస్తున్నారు.

జనగామ జిల్లాకు చెం దిన వ్యాపారులు ప్రత్యేకంగా దళారులను నియమించుకుని సిరిసిల్ల జిల్లాలో చక్రం తిప్పుతున్నారని తెలిసింది. వానకాలం సీజన్‌కు సంబంధించిన వరి కోతలు ప్రారం భమైన నాటి నుంచి పల్లెల్లో దళారులు పాగా వేశారు. రైతులు పండించిన ధాన్యం కేంద్రాలకు తరలకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే, వ్యాపారులు ఎక్కువ ధర ఇస్తుండడంతో రైతులు వారికే ధాన్యం విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు.

రైతుల నుంచి ధాన్యం సేకరించిన వ్యాపారులు తర్వాత జిల్లాలే కాదు.. ఏకంగా రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తున్నారు. ధాన్యమంతా నేరుగా కాకినాడ పోర్టుకు తరలివెళ్తున్నది. మరోవైపు కొందరు రైతులు సరాసరి రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. బయట వ్యాపారులు, రైస్‌మిల్లర్ల నుంచి కేవలం మూడు రోజుల్లోనే రైతులకు సొమ్ము అందుతుండడం గమనార్హం.

కొర్రీలు లేకపోవడంతో ఆసక్తి..

రైస్ మిల్లర్లు, బయట వ్యాపారులు 70 కిలోల బస్తాకు కేవలం కిలో మాత్రమే తరు గు తీస్తున్నారు. ధాన్యంలో తేమశాతం ఎలా ఉన్నా వారు కాంటాలు కొనసాగిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వారంలో రైతులకు డబ్బులు ముట్టజెప్తున్నారు. ప్రభు త్వ మద్దతు ధర క్వింటాకు కేవలం రూ.2,320 ఉండగా, వ్యాపారులు మాత్రం క్వింటాకు రూ.2,400 చొప్పున చెల్లిస్తున్నారు. మద్దతు ధర కంటే రూ.80 అదనంగా రైతులకు అందుతున్నది.

వ్యాపారులు సోసైటీ నిర్వాహకులతో కుమ్మక్కై, దళారులను వినియో గించుకుని సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది. సోసైటీల సాయంతో ఓ నాబార్డ్ అధికారి తనకు బాగా కావాల్సిన ఓ వ్యక్తితో ధా న్యం కొనుగోలు వ్యాపారం చేయిస్తున్నట్లు సమా చారం. విక్రయించిన ధాన్యం డబ్బులు ఇప్పించేందుకు సోసైటీ చొరవ చూపుతుండడంతో రైతులు ఎలాంటి భయం లేకుండా దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు.

సోసైటీ నిర్వాహకులు ధాన్యం కొన్నందుకు గాను రైతులు ఒక బస్తాకు రూ.5 చొప్పున దళారులకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఇలా మద్దతు ధర కంటే రైతులకు ఎక్కువ ధర అందుతున్నప్పటికీ, ఒక వేళ డబ్బులు ఇవ్వకుండా సదరు వ్యాపారి పారిపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ రైతులకు లాభం జరుగుతున్నదనే భావనతో మిన్నకుంటున్నట్లు తెలుస్తున్నది.

జిల్లాలో సాగు ఇలా..

వానకాలంలో జిల్లావ్యాప్తంగా 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 4.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని యంత్రాంగం అంచనా వేసింది. దీనిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగో లు చేయాలని సర్కార్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ధాన్యం సేకరణకు జిల్లావ్యాప్తంగా ఐకేపీ, సొసైటీలు, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో 294 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి.