వనపర్తి జిల్లాలో ౩ నెలలుగా ఆబ్కారి కార్యాలయంలో కానరాని ఎక్సైజ్ అధికారి
వనపర్తి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా ఆబ్కారి శాఖ అధికారి గత మూడు నెలలుగా కార్యాలయానికి రాకుండా ఇంటి వద్దే తిష్ట వేశారు. తన ఇంటినే కార్యాలయంగా మార్చుకున్నారు. ఫైల్స్‌ను ఇంటికే తెప్పించుకుంటూ ఉద్యోగులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎప్పుడు కార్యాలయానికి వచ్చినా సార్ లేరంటూ జవాబు రావడంతో ప్రజలు అధికారి కోసం కార్యాలయంలోనే పడిగాపులు కాస్తున్నారు.
మరి కొందరు అధికారి దర్శనం కోసం ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. జిల్లాలో కల్తీ కల్లు, గుడుంబా, బెల్టు షాపుల్లో మద్యం ఏరులై పారుతుండగా ఆ శాఖ ఉన్నతాధికారి ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. తనకు రావాల్సిన మామూళ్లను మాత్రం కిందిస్థాయి అధికారి నుంచి తీసుకుంటున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.
సెటిల్‌మెంట్ల కోసమే ఇంటికి పరిమితం!
కార్యాలయంలో అయితే అవినీతి సొమ్మును ఆరగించేందుకు వెసులుబాటు ఉండదన్న భావనతోపాటు, ఆరోగ్యం కూడా సహకరించకపోవడం సదరు అధికారికి కలిసివస్తోంది. అనారోగ్యం సాకుతో ఇంటి వద్దే సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. మద్యం షాపులు, బెల్టు షాపులు వంటి వాటిపై తరచూ ఫిర్యాదులు వస్తున్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకుండా ఫిర్యాదుల ఆధారంగా సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్న ట్లు విమర్శలు వస్తున్నాయి.
షాడో ఎక్సైజ్ అధికారిగా కిందిస్థాయి ఉద్యోగి
ఎక్సైజ్ శాఖ అధికారి చాలాకాలంగా కార్యాలయానికి రాకపోవడంతో కార్యాలయ కార్యకలాపాల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణకు జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగిని ఏర్పాటు చేసుకున్నారు. సదరు ఉద్యోగి కూడా షాడో ఎక్సైజ్ అధికారిగా తనకంటే పై అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నట్టు కార్యాలయంలో జోరుగా చర్చ నడుస్తోంది. జిల్లా అధికారి సైతం ఎవరి ఫోన్‌కు స్పందించకపోవడం షాడో ఎక్సైజ్ అధికారి ఫోన్ ఎత్తడం కలిసి వచ్చింది. ఇదే అదునుగా తన స్థాయిలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు పెరుగుతున్నాయి.
కలెక్టర్ అంటే లెక్కలేదు?
కలెక్టరేట్‌లో కలెక్టర్ ఛాంబర్ పైఅంతస్థులో ఆబ్కారి కార్యాలయం ఉన్నది. అయినప్పటికీ కలెక్టర్ అంటే ఏమాత్రం లెక్క లేనట్లుగా సదరు అధికారి వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను నిలువరించాలని చెబుతుండగా సార్ మాత్రం కార్యాలయానికి రాకపోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఏమాత్రం గౌరవం లేదని తెలుస్తున్నది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూప ల్లి కృష్ణారావు జిల్లా పర్యటన సమయంలోనూ కార్యాలయానికి లేదా మంత్రి వెంట అందుబాటులోకి రాకపోవడం చూస్తే అసలు ఆ శాఖ అధికారి ఉన్నట్టా లేనట్టా అనే చర్చ జోరు అందుకుంది. విద్యావంతులు ఉన్న ఈ ప్రాంతంలో ఎక్సైజ్ శాఖ అధికారి సక్రమంగా పని చేయకపోవడంతో మత్తు పదార్థాల వాడకం గంజాయి, గుడుంబా వంటి వాటి వాడకం కూడా పెరిగిపోతున్నట్లు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.