- ఆగని విద్యార్థుల ఆత్మహత్యలు
- ఇన్‌చార్జి వీసీలతోనే పరిపాలన
- 9 వేల మంది విద్యార్థులకు ముగ్గురే కౌన్సిలర్లు
- బాలికల రక్షణకూ భద్రత కరువు
భైంసా, నవంబర్ 16: నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో విద్యా ర్థుల సమస్యలు, వారి ఆత్మహత్యలు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ హయాంలో విద్యార్థులు నిర్వహించిన ఆం దోళనలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్ర స్తుత సీఎం రేవంత్‌రెడ్డి గోడ దూకి విద్యార్థులను కలిశారు.
ఇప్పుడు సీఎంగా ఉన్నా కూడా తమను పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన పీయూసీ ద్వితీయ సంవత్సర విద్యార్థిని స్వాతిప్రియ ఆత్మహత్యతో చోటుచేసుకుంటున్న పరిణామాలు, విద్యార్థి సంఘాల ఆందోళనలు సమస్య తీవ్రతను గుర్తుచేస్తున్నాయి. 2008లో ఈ విద్యాసంస్థ ప్రారం భం కాగా ప్రస్తుతం 9 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఇప్పటి వరకు 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వాల పట్టింపులేనితనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించేందుకు 18 మంది సూపర్‌వైజర్లు ఉండాల్సి ఉండగా నలుగురు మాత్రమే ఉన్నారు. మరో 14 మంది పర్యవేక్షకుల నియామకానికి ప్రభుత్వం నోటి ఫికేషన్ ఇచ్చినా నేటికీ భర్తీ చేయలేదు.
నాణ్యమైన ఆహారం కరువు
విద్యాసంస్థ నిర్వహణా లోపంతో నాణ్యమైన ఆహారం అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మెనూ పాటించడం లేదని విద్యార్థులు అనేకసార్లు ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదులు కోకల్లలు. ముందు నుంచి ఓకే సంస్థకు భోజన తయా రీ కాంట్రాక్టు ఇవ్వడం, వారు ఉన్నతాధికారులకు, ప్రశ్నించేవారికి మామూళ్లు ముట్టచె ప్పడంతో వారిపై చర్యలు తీసుకోవడం లేద నే విమర్శలున్నాయి.
తరగతులు బహిష్కరించి విద్యార్థులు రోజుల తరబడి ఆందో ళనలు చేపట్టినా ప్రభుత్వాల నుంచి పరిష్కారం లభించలేదు. గతంలో అప్పటి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ స్వయంగా ఇక్కడికి వచ్చినా విద్యార్థుకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఎక్కువ..
ఏటా ట్రిపుల్ ఐటీలో పదోతరగతిలో మెరిట్ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తున్నా రు. ఎంపికైన మెజార్టీ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన తెలుగు మీడియం నుంచి వచ్చిన వారే. విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులను ఆంగ్లమాద్యమంలోనే చదవాల్సి ఉంటుంది.
దీంతో కొంతమంది విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అలాంటి విద్యార్థులను గుర్తించి వారి అనుమానాలను తీర్చి కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత అధికారులు, బోధనా సిబ్బందిదే. అది మచ్చుకైనా కనిపించడంలేదు.
విద్యాసంస్థ ఆరంభించి దశాబ్దం న్నర కాలం పూర్తయినా రెగ్యులర్ బోధనా సిబ్బంది, ఇతరత్రా సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇక్కడ మెజార్టీ బోధన సిబ్బంది ఒప్పందంపై పనిచేస్తున్నవారే. విద్యార్థుల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు గుర్తించి వారిలో ఆత్మస్థుర్యైన్ని నింపేందుకు ఆరోగ్య కౌన్సిలర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు.
సీఎంల నుంచి స్పందనేది?
బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను నాడు సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడంతో గత రెండు సంవత్సరాల క్రితం విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దీంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్జీయూకేటీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు భద్రత వలయాన్ని తప్పించుకుని ట్రాక్టర్‌పై పంట చేల మీదుగా వెళ్లి, గోడదూకి విశ్వవిద్యాలయం లోనికి వెళ్లారు. అటువంటిది ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న తలెత్తుతుంది.
ఇన్‌చార్జి వీసీలతో ఇంకెన్నాళ్లు?
2008 నుంచి నేటి వరకు రెగ్యులర్ వీసీని నియమించలేదు. ఇన్‌చార్జి వీసీలతోనే పరిపాలన కొనసాగుతున్నది. నెల రోజుల క్రితం ఇక్కడ ఉన్న ఇన్‌చార్జి వీసీపై పలు ఆరోపణలు రావడంతో ఇటీవలే ప్రభుత్వం కొత్తగా మరో ఇన్‌చార్జి వీసీగా గోవర్ధన్‌ను నియమించింది. వెయ్యిమందికి పైగా వివిధ విభాగాల్లో సిబ్బంది ఇక్కడ పనిచేస్తుంటారు. అయితే ఇన్‌చార్జి వీసీ కారణంగా సిబ్బందిపై నియంత్రణ లేకపోతుందనే విమర్శలున్నాయి.
కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు!
బోధన సిబ్బందిలో 18 మంది ఉద్యోగులు రెగ్యులర్ వారు ఉండగా 196 మంది కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. 50 మంది కేర్‌టేకర్‌లకు గాను 14 మంది మాత్రమే పని చేస్తున్నారు. విద్యార్థుల మానసిక పరివర్తను గుర్తించే ఆరోగ్య కౌన్సిలర్‌లు లేకపోవడంతో వారు ఏం చేస్తున్నారో తెలియడం లేదు.
ఇది ఇలా ఉంటే కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. నైపుణ్యం లేకున్నా పైరవీలతో నియమితులయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయ పరిజ్ఞానంలేని ఫలితంగా విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని తెలుస్తున్నది.