- క్వార్టర్స్‌లో అలెక్స్ మినార్‌పై విజయం
- నాకౌట్ పోరుకు స్వియాటెక్, కీస్ సిద్ధం
- ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
మెల్‌బోర్న్: ప్రపంచ నంబర్‌వన్, ఇటలీ స్టార్ జానిక్ సిన్నర్ వరుసగా రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ అందుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలి చాడు. టోర్నీ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శిస్తోన్న సిన్నర్ క్వార్టర్స్‌లోనూ దూకుడు చూపెట్టగా.. అమెరికా కుర్రాడు బెన్ షెల్టన్ సెమీస్‌కు దూసుకొచ్చాడు.
మహిళల విభాగంలో స్వియాటెక్‌తో పాటు మాడిసన్ కీస్ నాకౌట్ పోరుకు అర్హత సాధించింది. నేడు జరగనున్న మహిళల సెమీఫైనల్లో సబలెంకతో బడోసా, స్వియాటెక్‌తో కీస్ అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం జరగనున్న పురుషుల సింగిల్స్ సెమీస్‌లో జొకోవిచ్‌తో జ్వెరెవ్, సిన్నర్‌తో షెల్టన్ ఆడనున్నారు.
సిన్నర్ చకచకా..
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జానిక్ సిన్నర్ పెద్దగా కష్టపడకుండానే సెమీస్‌లో అడుగపెట్టాడు. బుధవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్స్‌లో సిన్నర్ 6-3, 6-2, 6-1తో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. గంటా 48 నిమిషాల పాటు సాగిన పోరులో ఆడిన మూడు సెట్లలోనూ సిన్నర్‌దే పైచేయి. మ్యాచ్‌లో సిన్నర్ రెండు ఏస్‌లతో పాటు 27 విన్నర్లు సంధించగా..
10 విన్నర్లకే పరిమితమైన మినార్ 26 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మరో క్వార్టర్స్‌లో 21వ సీడ్ బెన్ షెల్టన్ 6-4, 7-5, 4-6, 7-6 (7/4)తో లోరెంజో సోయెంగోపై గెలుపొందాడు. దాదాపు నాలుగు గంటలు సాగిన మ్యాచ్‌లో తొలి మూడు సెట్లు హోరాహోరీగా జరగ్గా.. నాలుగో సెట్‌ను టై బ్రేక్‌లో సొంతం చేసుకున్న షెల్టన్ మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.
స్వియాటెక్ జోరు..
ఇక మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్ తన జోరు ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోని స్వియాటెక్ కార్టర్స్ లోనూ అదే కంటిన్యూ చేసింది. అమెరికాకు చెందిన 8వ సీడ్ నవారోపై 1-6, 2-6తో స్వియాటెక్ సులువైన విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో స్వియాటెక్ 22 విన్నర్లు కొట్టగా..
నవారో మాత్రం 15 విన్నర్లు మాత్రమే కొట్టి 22 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్‌లో మాడిసన్ కీస్ 3-6, 6-3, 6-4తో ఉక్రెయిన్‌కు చెందిన ఎలీనా స్వితోలినాను మట్టికరిపించింది. మాడిసన్ కీస్‌కు ఇది వరుసగా 10వ విజయం కావడం విశేషం. మ్యాచ్‌లో కీస్ 49 విన్నర్లు సంధించింది.