calender_icon.png 15 November, 2024 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒంటరి వ్యక్తులే అతడి టార్గెట్

13-11-2024 12:36:56 AM

  1. పరిచయం చేసుకొనిఆపై మద్యం తాగిస్తాడు
  2. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకుపోయి బండరాయితో హతమారుస్తాడు
  3. వరుస హత్యల కేసులో నిందితుడి అరెస్టు 
  4. వివరాలు వెల్లడించిన ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి

మెదక్, నవంబర్ 12 (విజయక్రాంతి): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో వరుస హత్యలు, దహనం కేసు లో ఉత్కంఠకు తెరపడింది. ప్రత్యేక బృందం హత్యలు చేస్తున్న వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. 

 ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి తెలిపిన వివరాలు.. చిన్నశంకరంపేట మండలం రుద్రా రం గ్రామానికి చెందిన ఒట్టేం మల్లేశం(నిందితుడు) అలియాస్ గొల్ల మల్లేశం.. 2013 సంవత్సరంలో చిన్నశంక రంపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ హత్య కేసులో 10 సంవత్సరాలు జైలుశిక్ష పడగా 2017లో విడుదలయ్యాడు.

ఈ క్రమంలో 2017లో సెంట్రల్ జైలులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగిని వేధించగా కూషాయిగూడ పోలీసులు మల్లేశంపై అట్రాసిటీ కేసు నమోదు చేసి మరోమారు జైలుకు పంపించారు.

ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న మల్లేశం 2019లో కీసర పోలీస్ స్టేషన్ పరిధి నేతాజీనగర్‌లోని జూనియర్ అసిస్టెంట్ ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోని వస్తువులను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ కేసుకు సంబంధించి కీసర పోలీసులు మల్లేశాన్ని అరెస్టు చేసి మరోసారి జైలుకు పంపిం చారు.

2022లో జైలు నుంచి విడుదలైన మల్లేశం.. ఆ తర్వాత కాచిగూడ నుంచి నిజామాబాద్ వెళ్లే రైళ్లలో దొంగతనాలు చేస్తూ రైల్వే ఫ్లాట్‌ఫాంలపై నివసిస్తూ ఉండేవాడు. రైళ్లలో, ఫ్లాట్‌ఫాంలపై ఒంటరిగా ఉన్నవారితో పరిచయం ఏర్పరుచుకొని వారితో కలిసి మద్యం సేవించి ఆపై వారిని హత్యచేసి వారివద్ద ఉన్న వస్తువులను దొంగిలించేవాడు.

ఇలా దొంగలించిన నగదు, సొత్తును అతడి అన్న ఒట్టేం రమేశ్ అలియాస్ గొల్ల రమేశ్‌కు ఇచ్చేవాడు. ఈ క్రమంలో అక్టోబర్ 22న నిందితుడు నిజామాబాద్‌లో గల లేబర్ అడ్డా వద్ద నవీన్‌తో పరిచయం చేసుకొని అతన్ని చిన్నశంకరంపేట వైన్స్‌కు తీసుకువచ్చి అతనికి మద్యం తాగించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వెనుకాల తీసుకువచ్చి బండరాయితో కొట్టి నవీన్‌ను దారుణంగా హత్యం చేసి ఆపై శవాన్ని దహనం చేశాడు.

అలాగే ఈనెల 3న ఇందలవాయి రైల్వే స్టేషన్‌లో కొమ్రె స్వామిని పరిచయం చేసుకొని అతన్ని చిన్నశంకరంపేటకు తీసుకువచ్చి వైన్స్‌షాపులో మద్యం తాగించి పద్మనాభస్వామి గుట్ట వద్ద బండరాయితో కొట్టి చంపి అతడి శవాన్ని తగులబె ట్టాడు. వరుస హత్యలను ఛేదించే క్రమంలో పోలీసులు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా..

మంగళవారం మల్లేశం చిన్నశంకరంపేటలో అనుమానాస్పదంగా సంచరిస్తుడటా న్ని ప్రత్యేక బృందం పోలీసులు గమనించారు.  మల్లేశంని అదుపులోకి తీసుకొని విచారించగా తాను చేసిన హత్యానేరా లను ఒప్పుకు న్నాడు. మల్లేశ్, అతడి అన్న గొల్ల రమేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

వారివద్ద బంగారు ఉంగరం, బంగారు చైన్, 5 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఒక సుత్తి స్వాధీనం చేసుకున్నారు. మల్లేశంను అదుపులోకి తీసుకున్న బృందంలో తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, రామాయంపేట సీఐ వెంకట రాజాగౌడ్, చిన్న శంకరంపేట ఎస్‌ఐ నారాయణ, రామాయంపేట ఎస్‌ఐ బాలరాజు, క్లూస్, సీసీఎస్ టీం సభ్యులు ఉన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసు సిబ్బందిని  ఎస్పీ అభినందించారు.