- స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు
- చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు
- నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేసింది. ఈ ఏకసభ్య కమిషన్‌కు చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావును, సెక్రటరీగా ఐఎఫ్‌ఎస్ అధికారి బీ సైదులను ప్రభుత్వం నియమించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు గాను రాష్ట ప్రభుత్వం గతంలో బీసీ కమిషన్‌కు బాధ్యతలు అప్పగించింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హైకోర్టుకు వెళ్లడంతో, హైకోర్టు ప్రత్యేక (డెడికేటెడ్) కమిషన్ ఉండాలని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. రిజర్వేషన్లపై అధ్యయనం చేసి నెల రోజుల లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేం దుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన బూసాని వెంకటేశ్వరరావు 1987లో గ్రూప్-1 అధికారిగా ఎంపికై, 1993లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. ఆయన 1959 డిసెంబర్ 2న హైదరాబాద్‌లో జన్మించారు. సాలిడ్ స్టేట్ ఎలక్ట్రానిక్స్‌లో ఎంఈ చదివారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు.
విజయనగరం జిల్లా కలెక్టర్, సంక్షేమ శాఖ డైరెక్టర్, అఫ్కో ఎండీగా, ఎన్నికల కమిషన్‌కు కార్యదర్శిగా, ఐదుసార్లు జనరల్ ఎన్నికలకు పరిశీలకులుగా ఉన్నారు. ఏపీ హ్యాండిక్రాప్ట్స్ ఎండీగా, జేఏడీ కార్యదర్శిగా, రెవెన్యూ ఎండోమెంట్ కార్యదర్శిగా, ఫిషరీస్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా, ఎంసీహెచ్‌ఆర్డీ అడిషన్ డైరెక్టర్‌గా, 2019లో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి పదవీ విరమణ పొందారు. సర్వీస్ రూల్స్, పాలసీ మ్యాటర్, రిక్రూట్‌మెంట్ పాలసీ, సర్వీస్ కమిషన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, న్యాయపరమైన అంశాలపై ఆయన నిపుణులుగా పేరుగాంచారు.