- ఆరు పతకాలతోనే సరి..
- నిరాశపర్చిన భారత అథ్లెట్లు
- 117 మంది పాల్గొంటే వచ్చినవి ఆరు పతకాలే
- అథ్లెట్ల ప్రదర్శనకు కారణాలు అనేకం
పరాయి పాలన పోయి 76 ఏండ్లు..
గణతంత్ర దేశంగా మారి 74 ఏండ్లు..
అయితే మాత్రం.. ఇప్పటికీ మన దేశం ఒలింపిక్స్‌లో కేవలం ఆరంటే ఆరే పతకాలు సాధించింది. ఎవరు విన్నా హవ్వా అని నవ్వేలా ఆరంటే ఆరే పతకాలు.. అదీ ముక్కీ మూలిగితే వచ్చాయి. చివరి రోజుల్లో 3 పతకాలు రాకపోయి ఉంటే ముచ్చటగా మూడు అనే టైటిల్‌తోనే మనకు ఎండ్ కార్డు పడేది. కానీ చివరికి మనోళ్లు ఇంకో మూడు పతకాలు సాధించి మన పరువు దక్కించారు. ప్రపంచంలోనే జనాభాలో మొదటి స్థానంలో ఉన్న మన దేశం మరి పతకాల పట్టికలో ఎక్కడ ఉందో భూతద్దం పెట్టి వెతికినా కనిపించట్లేదు. చివరికి తినడానికి తిండి కూడా సరిగ్గా లేని పాకిస్తాన్ తరఫున ఓ అథ్లెట్ (జావెలిన్ త్రోయర్ అర్షద్) స్వర్ణం సాధించాడు.
హే.. మనల్నెవడ్రా ఆపేది అంటూ రెచ్చిపోయే భారత్‌కు మాత్రం ఒక్కటంటే ఒక్క స్వర్ణ పతకం కూడా రాలేదు. ఈ విషయాలు చెబితే దేశ భక్తి లేదు అని కొంత మంది అన్నా కానీ ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన చేదులాంటి నిజం. 117 మంది అథ్లెట్లు పాల్గొంటే కనీసం పది పతకాలు అయినా రాలేదంటేనే మన పరిస్థితి ఎలా ఉందో, మన స్థానం ఎక్కడ ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు (ఓ స్వర్ణం కూడా) సాధించిన మన అథ్లెట్లు నాలుగేళ్ల తర్వాత జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం ఆరు పతకాలతో (ఒక్క స్వర్ణం కూడా లేదు) తీవ్రంగా నిరాశపర్చారు. కనీసం 2028 ఒలింపిక్స్ పోటీల్లో అయినా సరే గౌరవప్రదంగా పతకాలు సాధించేలా మన అథ్లెట్లు తయారు కావాలని కోరుకుంటూ జైహింద్.. భారత్ మాతా కీ జై..
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 117 మంది అథ్లెట్లు వెళ్లారు. పోయినసారి ఒలింపిక్స్‌లో సాధించిన వాటి కంటే ఈ సారి ఎక్కువ పతకాలను మన అథ్లెట్లు సాధిస్తారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే కలలు కూడా కన్నారు. ఈ సారి మన పతకాల సంఖ్య డబుల్ డిజిట్ దాటుతుందని ఊహించారు. అందుకు తగ్గట్లే మన అథ్లెట్లు ఘనంగా మొదలుపెట్టారు. ఇక పతకాలు ఖాయం అని అభిమానులంతా గర్వంగా ఫీలయ్యారు.
కానీఒకటి అనుకుంటే దైవం మరోటి తలచినట్లు అయింది మన పరిస్థితి. ఒలింపిక్స్ జూలై 26 (ఓపెనింగ్ సెర్మనీ) వదిలిపెడితే 27 నుంచి పోటీలు మొదలయ్యాయి. ఇలా పోటీలు మొదలు అయిన తర్వాతే జూలై 28నాడే మనూ బాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం కొల్లగొట్టి భారత్ తరఫున పతకాల బోణీ చేసింది. ఒలింపిక్స్ మొదలైన రెండో రోజే మన పతకాల బోణీ అయింది ఈ సారి డబుల్ డిజిట్ పక్కా అని అంతా అనుకున్నారు. కానీ చివరికి మాత్రం అందరికీ నిరాశే ఎదురైంది.
మరోసారి షూటింగ్‌లోనే
ఒలింపిక్ క్రీడలు మొదలైన రెండో రోజే మనకు పతకం వచ్చిందని ఆనందంతో ఉన్న మన దేశ ప్రజలను మరింత ఆనందంలో ముంచుతూ జూలై 30న మనూ బాకర్ జోడీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో కాంస్యం దక్కించుకుంది. ఇక ఈ జోడీ ప్రదర్శనతో మనకు ఈ సారి డబుల్ డిజిట్ పక్కా అని అంతా ధీమా వ్యక్తం చేశారు. కానీ చివరికి వచ్చే సరికి మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. దారుణ ప్రదర్శన చేసిన మన అథ్లెట్లు కేవలం ఆరంటే ఆరే పతకాలతో ఎక్కడో నిలిచారు. మన దేశ ప్రజానీకానికి ఎదురుచూపులే మిగిల్చారు.
ఈ సారి కూడా.. ఆనందం త్రిబుల్
జూలై 30నే మనకు కాంస్యం రావడంతో మన పతకాల సంఖ్య రెండుకు చేరింది. రెండుకు రెండు పతకాలు షూటింగ్లోనే వచ్చాయి. కేవలం మూడంటే మూడే రోజుల్లో మన అథ్లెట్లకు రెండు పతకాలు రావడంతో అందరూ డబుల్ డిజిట్ కోసం ఆశపడ్డారు. ఇక ఆగస్టు నెల ప్రారంభమే మన భారతీయులకు తియ్యని కబురు మోసుకొచ్చింది. మరోమారు షూటింగ్‌లోనే మన భారత్‌కు పతకం వచ్చి చేరింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో స్వప్నిల్ కుసాలే మరోమారు కంచుమోగించాడు. దీంతో మన పతకాల పట్టికలో మూడో పతకం వచ్చి చేరింది. దీంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 5 రోజులు పూర్తయ్యే సరికి మూడు పతకాలు (మూడు కాంస్యాలు) వచ్చి చేరాయి. ఇక పతకాల పట్టిక ఈ సారి గేరు మారుస్తుందని అంతా ఆశించారు.
మొదటి వారం.. పతకం కోసం జాగారం
ఆగస్టు మొదటి వారం భారత్‌కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఆగస్టు 1న మినహాయిస్తే మరో పతకం మన ఒడిలో చేరేందుకు మరో వారం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సి వచ్చింది. ఆగస్టు 8న భారత పురుషుల హాకీ జట్టు మన పతక కరువు తీరుస్తూ కాంస్యాన్ని సాధించింది. ఇక అదే రోజు (ఆగస్టు 8) బల్లెం వీరుడు నీరజ్ చోప్రా మొదటి రజతం సాధించాడు. ఇక ఆగస్టు 9న పురుషుల రెజ్లింగ్‌లో అమన్ షెరావత్ కాంస్య పతకం సాధించాడు.
ఇక మొత్తంగా మన భారత్ ఖాతాలో ఆరు పతకాలు సాధించినట్లయింది. పోయినసారి 7 పతకాలు (ఓ స్వర్ణంతో కలిపి) సాధించిన భారత్.. ఈ సారి మాత్రం ఆరు పతకాలతోనే (స్వర్ణం లేకుండా) సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పతకాల పట్టికను చూసిన చాలా మంది ప్రపంచ జనాభాలో తొలి స్థానంలో ఉన్న మనం మరి పతకాల పట్టికలో ఏ స్థానంలో ఉన్నాం అని కామెంట్ చేస్తున్నారు.
ప్చ్.. స్టార్లకు కలిసిరాలే
ఒలింపిక్స్ ఆరంభానికి ముందు భారత్‌కు పతకం సాధించే వారి జాబితాలో ఉన్న చాలా మంది స్టార్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. అరే వీరు తప్పకుండా పతకం సాధిస్తారని అనుకున్నవారంతా నిరాశపర్చారు. ఒలింపిక్స్‌కు ముందు జరిగిన అనేక పోటీల్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన స్టార్స్ ఒలింపిక్స్‌లో మాత్రం తేలిపోయారు. ఫలితంగా ఉత్త చేతులతో వెనుదిరిగారు. ఈ లిస్టు గురించి చెప్పుకుంటే చాలా మంది స్టార్స్ ఈ జాబితాలోకి వస్తారు.
సింధు చేయలేకపోయింది కనువిందు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు (ఒక రజతం, ఒక కాంస్యం) సాధించిన ఈ హైదరాబాదీ షూటర్ మరోసారి పతకం తీసుకొచ్చి భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తుందని అంతా భావించారు. కానీ సింధు మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. గ్రూప్ స్టేజ్‌లో రెచ్చిపోయిన సింధు నాకౌట్ మ్యాచ్ అయిన రౌండ్ ఆఫ్ 16 (ప్రిక్వార్టర్స్)లో మాత్రం చైనా క్రీడాకారిణి చేతిలో ఓడిపోయింది. చివరి ఒలింపిక్స్‌లో ఇదే క్రీడాకారిణి మీద గెలిచి కాంస్యపతకం సాధించింది. ఈ సారి మాత్రం ఆమె మీద గెలవలేక చతికిలపడింది.
సరిపోని నిఖత్.. తాకత్
ఇక తప్పకుండా పతకం తెస్తుందని ఆశలు పెట్టుకున్న మరో క్రీడాకారిణి.. హైదరాబాదీ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్. ఈ బాక్సర్ కూడా ఒలింపిక్స్ ముందు జరిగిన పోటీల్లో తన పంచులతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతే కాకుండా రెండు సార్లు వరల్డ్ చాంపియన్‌షిప్‌ను కూడా గెల్చుకుంది. అయితేనేం ఒలింపిక్స్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. గ్రూపు మ్యాచుల్లో పర్వాలేదనిపించిన నిఖత్.. నాకౌట్ దశకు చేరుకునే సరికి మాత్రం తేలిపోయింది. రౌండ్ ఆఫ్ 16 పోటీల్లో చైనా బాక్సర్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఈ ఇద్దరు మాత్రమే కాకుండా పతకం తెస్తారని ఆశలు రేపిన అనేక మంది అథ్లెట్లు ఈ ఒలింపిక్స్‌లో విఫలమయ్యారు.
వినేశ్.. అంతా భేష్ కానీ
మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విషయంలో విధి మనల్ని వెక్కిరించిన తీరు మరీ దారుణం. సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ బౌట్‌కు దూసుకెళ్లిన వినేశ్.. కోట్లాది మంది భారతీయుల్ని ఆనందంలో ముంచెత్తింది. రెజ్లింగ్‌లో మనకు పతకం ఖాయం చేసిన వినేశ్‌ను అంతా ఆకాశానికెత్తేశారు. కొద్ది గంటలయితే ఫైనల్ బౌట్ జరుగుతుంది.. ఒక వేళ ఫైనల్లో వినేశ్ ఓడిపోయినా కానీ మనకు కనీసం రజతం అయినా వస్తుందని అంతా అనుకున్నారు.
కానీ విధి ‘అధిక బరువు’ రూపంలో మన ఆశలపై నీళ్లు చల్లింది. కోట్లాది మంది భారతీయుల కలలను కల్లలయ్యేలా చేసింది. అధిక బరువు కారణంగా వినేశ్‌ను ఒలింపిక్ పోటీల నుంచి అనర్హురాలిగా ప్రకటిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. తర్వాత ఈ నిర్ణయాన్ని వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్‌లో సవాల్ చేసింది. ఈ కోర్టు తీర్పు కోసం భారతీయులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
పాక్ కంటే ఘోరంగా
మన దేశం నుంచి ఒలింపిక్స్ 117 మంది అథ్లెట్లు వెళ్లారు. కానీ కేవలం ఆరు పతకాలు మాత్రమే మనకు వచ్చాయి. అందులో ఒక్కటి కూడా స్వర్ణం లేదు. కానీ పాకిస్తాన్ నుంచి ఏగుగురు అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నా కానీ వారికి ఒక స్వర్ణపతకం వచ్చింది. దీంతో వారు పతకాల పట్టికలో మనకంటే ముందుకు వెళ్లారు. (పతకాల పట్టికను స్వర్ణాల సంఖ్య ఆధారంగా తయారు చేస్తారు.