27-04-2025 12:00:00 AM
మానసి.. కోల్‌కతాకు చెందిన 24 ఏళ్ల యువతి. చిన్నతనం నుంచే సంగీతమంటే ప్రాణం. ఆ మక్కువతో తరచూ టీవీలు, రేడియోల్లో పాటలు వినేది. సంగీత కార్యక్రమాల్ని ఎంతో ఆసక్తిగా వీక్షించేది. ఎక్కడ సంగీత ప్రదర్శన జరిగినా వెళ్లేది. అలా కేవలం చూడటమే కాదు.. మెలొడీస్, డ్యూయెట్స్, ఫాస్ట్‌బీట్స్.. వంటి విభిన్న శైలుల్లో ఎలా పాటలు పాడాలో ఆయా వీడియోలు, షోస్‌ని వీక్షించి మరీ సంగీతం నేర్చుకుని ‘ఇండియన్ ఐడల్’లో విజేతగా నిలిచింది ఈ సింగింగ్ క్వీన్.
మానసి ఆసక్తిల్ని గ్రహించిన తల్లిదండ్రులు అదే దిశగా ఆమెను ప్రోత్సహించారు. చిన్నప్పుటి నుంచే వివిధ స్టేజ్ షోస్, రియాల్టీ షోలలో పాల్గొంటూ తన సంగీత మెలకువలకు మెరుగులు దిద్దుకున్న మానసి.. మరోవైపు వెస్టర్న్ మ్యూజిక్‌ను కూడా వింటూ నేర్చుకుంది.
తొమ్మిదో తరగతిలోనే..
మానసి తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే ప్రొఫెషనల్ సింగర్ కావాలని తన కెరీర్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ దిశగా ప్రయత్నాలూ ప్రారంభించింది. కాని అనుకోకుండా కొవిడ్ సమయంలో తన తండ్రి వ్యాపారం నష్టాలు చవిచూడటంతో కుటుంబ పోషణ భారం ఆమెపై పడింది. అలాగని ఏం మాత్రం భయపడలేదు. తన సంగీత నైపుణ్యాలపైనే నమ్మకముంచిన ఆమె.. వివిధ సంగీత ప్రదర్శనల్లో పాటలు పాడుతూ.. ప్రత్యేకంగా మ్యూజిక్ కన్సర్ట్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నది.
గొప్ప అనుభవం
‘పిల్లల్ని పెంచి పెద్ద చేయడం, ప్రయోజకుల్ని చేయడం.. వంటి విషయాల్లో ఎలాగైతే తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరిస్తారో.. అవసరమొచ్చినప్పుడు కుటుంబ పోషణ, వాళ్ల బాగోగులు చూసుకోవడం బాధ్యత కూడా పిల్లలపై ఉంటుంది. కొవిడ్ సమయంలో ఇంటి బాధ్యతల్ని నిర్వర్తించడం గొప్ప అనుభవం. గొప్ప సింగర్ అయ్యాక ఓ పెద్ద ఇంటిని మా తల్లిదండ్రులకు బహుమతిగా ఇస్తానని వాళ్లకు మాటిచ్చా’ అంటున్నది మానసి.
విజేతగా..
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఇండియన్ ఐడల్’లోనూ పాల్గొనాలనుకుంది. ఆడిషన్స్‌లో అద్భుతమైన సంగీత నైపుణ్యాల్ని ప్రదర్శించి ఇండియన్ ఐడల్‌లో అడుగు పెట్టింది. అలా మొదటి ప్రదర్శన నుంచి చివరి ప్రదర్శన వరకు ప్రేక్షకుల్ని అలరించింది. ప్రతి రౌండ్లోనూ జడ్జిల్ని మెప్పించింది. ఆమె ఆత్మవిశ్వాసమే రియాల్టీ షో టాప్ ప్రవేశించేలా చేశాయి.
ఇక ఫైనల్లో యువ గాయకులు స్నేహ శంకర్, సుభజిత్ చక్రవర్తిల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న మానసి.. వాళ్లను అధిగమించి టైటిల్ గెలుచుకున్నది. అలా తాజాగా ముగిసిన ‘ఇండియన్ ఐడల్ సీజన్ విజేతగా నిలిచింది మానసి. ట్రోఫీతో పాటు 25 లక్షల ప్రైజ్‌మనీ, ఓ బ్రాండ్ న్యూ కారును సొంతం చేసుకున్నది ఈ సింగింగ్ క్వీన్.
తల్లిదండ్రుల ప్రోత్సాహం
‘ఫైనల్‌లో మా తల్లిదండ్రులు నా ప్రదర్శన చూసి ఎమోషనల్ అయ్యారు. ఈ పోటీ ఆద్యంతం అడుగడుగునా వాళ్లందించిన ప్రోత్సాహం నన్నీ స్థాయికి చేర్చింది. ఈ విజయంతో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఇక ఈ ప్రైజ్‌మనీని సంగీతంలో నన్ను నేను మరింత మెరుగుపరచుకోవడానికి వెచ్చించాలనుకుంటున్నా’ అంటూ ట్రోఫీ అందుకున్న క్షణం తన భవిష్యత్ ప్రణాళికల గురించి బయట పెట్టింది మానసి.