- తెలంగాణ నుంచి అవకాశం కల్పిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం
- కేకే రాజీనామాతో ఖాళీ అయిన స్థానం
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఎంపికను ధ్రువీకరించారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కే కేశవరావు రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభిషేక్ మను సింఘ్వీకి అవకాశం కల్పించింది. కాగా రాజ్యసభలోని ఖాళీ అయిన 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులుగా ఉన్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోటీ చేయడంతో వారు రాజ్యసభకు రాజీనామా చేశారు. రాజ్యసభకు రాజీనామా చేసిన వారిలో పీయూషీ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాధిత్య సింధియా, కామఖ్య ప్రసాద్, వివేక్ ఠాకూర్, ఉదయన్ రాజే భోస్లే, బిప్లబ్ కుమార్ దేబ్ (బీజేపీ), మీసా భారతి (ఆర్జేడీ), దీపేంద్ర సింగ్ హుడా, కేసీ వేణుగోపాల్ ( కాంగ్రెస్) లోక్‌సభకు ఎన్నికయ్యారు. తెలంగాణలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావు కాంగ్రెస్ లో చేరడం, ఒడిశాలోని బీజేడీ ఎంపీ మమతా తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఆ రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ గవర్నర్ కోటాలో కొత్త నియామకాలపై స్టే ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లవుతుందని వ్యాఖ్యానించింది. రాష్ట్రప్రభుత్వం గవర్నర్ కోటాలో సిఫార్సు చేసిన కోదండరాం, అమీర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారయణ పేర్లను సిఫారసు చేసింది. వీరిద్దరికీ రాజకీయ నేపథ్యం ఉందని, అప్పటి గవర్నర్ తమిళిసై వారిద్దరి పేర్లను తిరస్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేసిన కోదండరామ్, అమీర్‌అలీ ఖాన్ పేర్లను ఆమోదించడంతో.. బీఆర్‌ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. వారి నియామకంపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.