దొడ్డిదారిన సింగరేణిని ప్రైవేటీకరించేందుకు జరిగే కుట్రను కార్మిక వర్గం, ప్రజలు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఐక్యంగా అడ్డుకోవాలి. వేలం పాటలను ప్రభుత్వం రద్దు చేసేదాకా పట్టు విడవక పోరాడాలి.
కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో (మొన్నటిదాకా) బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్.. పార్టీల పేరు మాత్రమే వేరు. కానీ, వారి లక్ష్యం, కార్యాచరణ ఒకటే. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, కార్పొరేట్ సెక్టారుకు ప్రయోజనం చేకూర్చడం. గతంలో కార్మికుల సంక్షేమం, వారి భద్రత కోసం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వరంగ సంస్థలకు కొన్ని ఉత్పత్తులను రిజర్వు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ఉపయుక్త చట్టాలు చేసింది. 1990 తర్వాత ప్రభుత్వ విధానాల్లో మౌలిక మార్పు వచ్చింది. సరళీ కరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఆర్థిక విధానాలతో, మార్కెట్ల అన్వేషణతో మొదలైంది.
గాట్ ఒప్పంద నియమాలు, ప్రపం చ బ్యాంక్ ఆర్థ్ధిక నియమాల నియంత్రణ, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) రుణాలు, వాటి అనువర్తిత నియమాలు, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అమలు చేసిన ఆర్థిక సంస్కరణలనే తర్వా త కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వమూ అనుసరిస్తున్నది. చంద్రబాబు ఈ ఆర్థిక విధానాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా అమలు చేశారు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థలకు దేశంలో బ్రాండ్ అంబాసిడర్‌గా, సీఈఓగా పేరు పొందారు. వీరి జెండాలు వేరు కానీ అజెండా మాత్రం ఒక్కటే.
క్యాప్టివ్ మైనింగ్ పేరుతో..
ఈ నేపథ్యంలోనే సింగరేణి ప్రైవేటీకరణ సమస్యను చూడాలి. మొదట ‘క్యాప్టివ్ మైనింగ్’ పేరుతో కోల్ ఇండియా, సింగరేణి నుంచి బొగ్గు కొనకుండా తానే ఉత్పత్తి చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. తర్వాత నెమ్మదిగా సాధారణ బొగ్గు తవ్వకాల్లోనూ ప్రైవేట్ సంస్థల చొరబాటుకు దారిచూపి ఆపై వెసులుబాటు కల్పించింది. లీజ్ ఒప్పంద విధానాల్లో మార్పులు చేసింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత పదేళ్ళుగా దూకుడుగా ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తున్నది. అందులో భాగంగా 2021లో మరో దుర్మార్గ చట్టాన్ని తెచ్చింది. బొగ్గు వేలం పాటలో నెగ్గిన వారికి ఎలాంటి షరతులు లేకుండా ఆ చట్టం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. కార్మికుల భద్రత, సంక్షేమం, పర్యావరణ సంరక్షణ వంటి సమస్యలు ఏవీ వారికి ముఖ్యం కాదు. కార్పొరేట్ సెక్టార్‌కు వ్యాపార సామ్రాజ్య విస్తరణలో ఇతోధికంగా సహకరించటమే వారి విధానం.
అధిక లాభాలు కాదని..
రాష్ట్రంలో సింగరేణి ప్రధాన ప్రభుత్వరంగ సంస్థ. ఇది లక్షాలాది కార్మికులతో లాభాలు ఆర్జ్జిస్తున్నది. ఈ సమస్య కేవలం ఆ ప్రాంత ప్రజల అభివృద్ధితో మాత్రమే ముడిపడి లేదు. దాంతోపాటు కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపయోగకరంగా ఉంది. విద్య, ఉపాధి, సంస్కృతి పరంగా పెనవేసుకొని ప్రగతికి దోహదపడే సంస్థ. ఇంత ప్రాముఖ్యం కలిగిన సంస్థను వేలం పాటల ద్వారా ప్రైవేటీకరించడం ఎంతమాత్రం తగదు. దానివల్ల ఆ సంస్థతో పాటు లక్షలాది కార్మిక కుటుంబాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.
వాస్తవంగా ప్రభుత్వమే పూనుకొని సింగరేణి ద్వారా బొగ్గు తవ్వకాలు జరిపితే ఉత్పత్తి కారుచౌకగా లభిస్తుంది. విద్యుదుత్పత్తికూడా ధారాళంగా, చౌకగా జరుగు తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అదనపు ఆదాయమూ సమకూరుతుంది. కార్మికుల, ప్రజల ప్రాధాన్యాలను పక్కనపెట్టి బొగ్గు బ్లాకును వేలం వేయటం దుర్మార్గం, శోచనీయం. దీనికి కారణం కార్పొరేట్లతో (ము ఖ్యంగా అదానితో) మోడీ ప్రభుత్వానికి ఉన్న విడదీయరాని అనుబంధమేనని తెలుస్తుంది. బడా కార్పొరేట్ల లాభాల కోసం లక్షలాది కార్మికులు, వారిపై ఆధారపడ్డ ఇతర ప్రజల పొట్టలు కొట్టడమే మోడీ ప్రభుత్వ అంతిమ లక్ష్యం. ఈ దురాగతాన్ని వామ పక్షాలుసహా ఇతర విపక్షాలు ఉమ్మడిగా అడ్డుకోవాలి. సీపీఎం తలపెట్టిన చైతన్యయాత్రకు ప్రజలంతా స్వాగతం పలకాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ కార్మిక వ్యతిరేక విధానాలను సామాన్య ప్రజలవద్దకు చేర్చాలి.
నష్టాల వైపు ప్రయాణం
పాలకుల విధానాలవల్ల కోల్ ఇండి యా, సింగరేణికి ఎలాంటి హక్కులు లేకుండా మిగతా వాటి లాగానే వేలం పాటలో పాల్గొనాలి. యూపీఏ ప్రభుత్వ హయాంలో కోల్ ఇండియాలో 10 శాతం వాటాలు అమ్మితే, మోడీ ప్రభుత్వం మరో 29 శాతం వాటాలను అమ్మింది. క్రమంగా వాటికున్న హక్కులను నిర్వీర్యం చేయటం, తెలంగాణ వరప్రదాయిని సింగరేణిని కార్పొరేట్ల చేతుల్లో పెట్టడం దాని లక్ష్యంగా ఉంది. ఆ విధానాలకు వ్యతిరేకంగా 2003 లో సింగరేణిలో 15 రోజులు సమ్మె జరిగింది. తర్వాత కార్మికులు అనేక పోరాటా లు చేశారు. అయినా, పాలకులు పెడచెవిన పెడుతున్నారు. మోడీ ప్రభుత్వం నగదీకరణ పేరుతో ప్రైవేటు సంస్థలకు విపరీత రాయితీలు ఇచ్చింది. బొగ్గు దిగుమతులపై సుంకం రద్దు చేసింది. వీటితోపాటు దేశంలో బొగ్గు వినియోగించే సంస్థలన్నీ 10 శాతం దిగుమతి చేసుకోవాలని నిబంధనలూ విధించింది.
ఈ విధంగా అదాని వద్ద దిగుమతుల రూపంలో బొగ్గు కొనేందుకు అవకాశం కల్పించింది. దీంతో టన్ను బొగ్గు రూ. 3,500, రూ.4,000కి ఇచ్చే సింగరేణి బొగ్గును కాదని అనివార్యంగా ఏపీ ప్రభుత్వం గతంలో టన్ను రూ.18 వేల చొప్పున 7 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి ఒప్పందం చేసుకుంది. అలాగే, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం జెన్‌కో, ఎన్‌టీపీసీ, రూ.30 వేల కోట్లు బకాయి పడ్డాయి. అయినా, సింగరేణి లాభాల్లోనే ఉన్నదన్న విషయాన్ని మర్చిపోరాదు. విద్యుదుత్పత్తిలోనూ ప్రైవే ట్ శక్తుల ప్రయోజనాలనే ప్రభుత్వం చూస్తున్నది. దీనివల్ల చార్జీలు పెరుగుతాయి. ఈ విధానాలవల్ల ప్రజలు, సమాజంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ప్రభుత్వ ఖజానాపైనా ప్రభావం ఉంటుంది.
బొగ్గు సింగరేణి హక్కు
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో సింగరేణి సంస్థ సొంత ఖర్చులతో అనేక ప్రాంతాల్లో సర్వే చేసి బొగ్గు బ్లాక్‌లను గుర్తించింది. ఆపై బొగ్గు ఉత్పత్తినీ చేపట్టింది. ‘శ్రావణపలి’్ల బ్లాక్‌లోనూ ఆ రకంగానే బొగ్గు తవ్వకాలు చేపట్టాలి. కానీ, వేలం పాట ద్వారా దక్కించుకోవాలని బీజేపీ ప్రభుత్వం నిర్దేశిస్తున్నది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వమూ ఇదే బాటలో నడిచి వేలం పాట ద్వారానే ప్రైవేటు వారికి ఇచ్చేసింది. దీంతో క్రమంగా సింగరేణి నష్టాలలోకి జారుకుంటుంది. అందుకే, వేలాన్ని రద్దు చేయాలని కార్మికులు, వారి కుటుంబాలు, ఆశేష ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో బొగ్గు బ్లాకులన్నీ సింగరేణి హక్కుగా పరిగణించి తీరాలి. నేరుగా సింగరేణికే బొగ్గు బ్లాకులు ఇవ్వాలి.
నయవంచక హామీలు
సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించబోమని ఒకవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెబుతూనే, మరోవైపు వేలం పాటలు పెట్టడం ఎందుకు? ఇది ప్రజలను, కార్మికులను పక్కదారి పట్టించి మోసగించడం కాదా? ---ఇటీవల జరిగిన వేలం పాట ప్రారంభం సందర్భంగా కిషన్‌రెడ్డిసహా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొనటం ఎంతమాత్రం సరికాదు. అసలు సింగరేణి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైఖరేమిటో స్పష్టం చేయాలి.---రాష్ట్ర ప్రభుత్వమూ సింగరేణి పరిరక్షణ కోసం కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తేవాలి. శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి. ఆ వెంటనే ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి ఒత్తిడి పెంచాలి. -దొడ్డిదారిన సింగరేణిని ప్రైవేటీకరించేందుకు జరిగే కుట్రను కార్మిక వర్గం, ప్రజలు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఐక్యంగా అడ్డుకోవాలి. వేలం పాటలను ప్రభుత్వం రద్దు చేసేదాకా పట్టు విడవక పోరాడాలి.
డా॥ కోలాహలం రామ్‌కిశోర్
సెల్: 9849328496