calender_icon.png 22 September, 2024 | 8:10 PM

నికర లాభాలపై 33శాతం వాటా చెల్లించాలి

22-09-2024 05:21:08 PM

హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్

మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి కార్మికులకు చెల్లించనున్న లాభాల వాటాను సవరించి సంస్థ సాధించిన మొత్తం లాభాలపై 33 శాతం లాభాల వాటాను కార్మికులకు చెల్లించాలని సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్(హెచ్ఎంఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలు 4701 కోట్ల రూపాయలు అని ప్రకటించినప్పటికీ, మొత్తం లాభాల మీద లాభాల వాటా ప్రకటించకపోతే సింగరేణిలో గెలిచిన గుర్తింపు కార్మిక సంఘమైన ఏఐటియుసి, ప్రాతినిధ్య కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ లు ప్రతిఘటించకపోవడం కార్మికులకు ద్రోహం చేయడమేనని అన్నారు.

సింగరేణికి వచ్చిన మొత్తం లాభాలు 4701 కోట్ల రూపాయలపై 33 శాతం లాభాల వాటా రూపేణా 1550 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా  సింగరేణి విస్తరణ కోసమని విద్యుత్, సోలార్ అని మాయమాటలు చెప్పి, కార్మికుల సొమ్ము 2281 కోట్ల రూపాయలను తీసుకుంటుంటే గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. ఎన్నడు లేని విధంగా సగం డబ్బులు పక్కన పెట్టి, మిగతా దానిలో 33 శాతం ఇచ్చిన అది కేవలం 16 శాతం మాత్రమే అవుతుందన్నారు. సింగరేణికి వచ్చిన మొత్తం లాభాలు 4701 కోట్ల రూపాయల నుండి విస్తరణ పేరుతో సగం డబ్బులు 2281 కోట్ల రూపాయలను పక్కనపెట్టి కేవలం మిగిలిన 2420 కోట్ల రూపాయలకు మాత్రమే 33 శాతం మాత్రమే లాభాల వాటా ఇవ్వడం తప్పని మండిపడ్డారు. వెంటనే లాభాల వాటాను సవరించి, మొత్తం లాభాలు 4701 కోట్ల రూపాయలపై ప్రకటించిన లాభాల వాటా 33 శాతం 1550 కోట్ల రూపాయలను సింగరేణి కార్మికులకు లాభాల వాటాగా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో  యూనియన్ ఏరియా ఉపాధ్యక్షుడు జే శ్రీనివాస్, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు పార్వతి రాజిరెడ్డి, నాయకులు బోనాల శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాసరెడ్డి, ముఖేష్, థామస్, సదానందం, రామస్వామి లు పాల్గొన్నారు.