09-03-2025 11:56:33 PM
సింగరేణి కార్మిక సంఘాల సూచన...
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జగత్‌ప్రసాద్, సింగరేణి అధికారుల సంఘం సీఎంవోఐఏ అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్ సూచించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడిమా సమావేశంలో వారు మాట్లాడారు. సింగరేణి లీజు ప్రాంతంలో బొగ్గు నిల్వలు త్వరగా తరిగిపోతున్నందున భవిష్యత్ అవసరాల కోసం కొత్త గనుల అవసరం ఉందన్నారు. వేలం లేకుండానే గనులు ఇప్పిస్తామని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. కొంతమందికి గనులు ఇప్పించుకునేందుకు వేలంలో సింగరేణిని పాల్గొనకుండా చేసిందని ఆరోపించారు.
బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బొగ్గు గనుల లీజు వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లాభం చేకూరుతుందని చెప్పారు. సింగరేణిలో గతంలో లక్షమందికి పైగా కార్మికులుండేవారన్నారు. కానీ ప్రస్తుతం 42 వేల మంది రెగ్యులర్, 30వేల మంది కాంట్రాక్ట్ కార్మికులున్నారని తెలిపారు. సమావేశంలో కార్మికసంఘాల నాయకులు మిర్యాల రంగయ్య, కాంపల్లి సమ్మయ్య, ఎన్.నర్సింహారెడ్డి, త్యాగరాజన్, తదితరులు పాల్గొన్నారు.