calender_icon.png 5 February, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిఖని పాత గనిని ఓపెన్ కాస్ట్ చేసే ప్రయత్నాన్ని సింగరేణి విరమించుకోవాలి

05-02-2025 06:32:10 PM

సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్...

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి శాంతిఖని పాత గనిని ఓపెన్ కాస్ట్ గా చేసే ప్రయత్నాలను సింగరేణి మానుకోవాలని సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ (భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు) కార్యదర్శి ప్రభాత్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. శాంతి ఖని గని పక్కనున్న ఆకెనపల్లి, పాత బెల్లంపల్లి, సుబ్బారావు పల్లి, లింగాపూర్, శ్రావణ్ పల్లి, బట్వాన్పల్లి గ్రామాలతో పాటు బెల్లంపల్లి పట్టణం విధ్వంసం అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ వనరుల దిబ్బతీసి, భూగర్భ జలాలు అడుగంటిపోయి, వన్యప్రాణులు అంతరించిపోయి, ఓసి ప్రభావంతో ప్రజలు భూ నిర్వాసితులుగా మారి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఓపెన్ కాస్ట్లు తీసిన ప్రాంతాల్లో ప్రజలు నిర్వాసితులుగా మారి పంట పొలాలు, ఇళ్ల స్థలాలు కూల్పోయి చెట్టుకు ఒకరు పుట్టకొకరుగా గాంధీ శీకులుగా మారి బతుకుతున్నారని పేర్కొన్నారు.

భూనిర్వాసితులను అనాదిగా సింగరేణి యాజమాన్యం ప్రభుత్వాల అండతో మోసగిస్తూనే ఉందని పేర్కొన్నారు. గత చంద్రబాబు పాలన నుండి నేటి రేవంత్ రెడ్డి పాలన వరకు భూనిర్వాసితులకు సరైన నష్టపరిహారం, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా జీవించే హక్కును అభివృద్ధి పేరిట హరిస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం చెబుతున్న మోసపూరిత మాటలను నమ్మకుండా ప్రభావిత గ్రామాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, పర్యావరణ పరిరక్షణ, గ్రామాల, పట్టణ ప్రజలు, ఓపెన్ కాస్ట్ విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. శాంతిఖని పాత గని ఓసిని నిలిపి వేసేందుకు పాలక పార్టీ ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎంపీ గడ్డం వంశీ బాధ్యతగా చొరవ చూపాలని, లేనట్లయితే ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న బెల్లంపల్లి మండల, పట్టణానికి చెందిన చెంచాలకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. వీరికి ఓసి బొందలు సమాధులుగా మారక తప్పదని ప్రకటనలో ప్రభాత్ తీవ్రంగా హెచ్చరించారు.

లేఖలపై విచారణ జరుపుతున్నాం... సిపి ఎం. శ్రీనివాస్ 

గత కొంతకాలంగా బెల్లంపల్లితో పాటు కోల్ బెల్ట్ ప్రాంతంలో మావోయిస్టు అనుబంధ కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరిట వెల్లడవుతున్న లేఖలపై విచారణ జరుపుతున్నామని రామగుండం సిపిఎం. శ్రీనివాస్ తెలిపారు. తాజాగా శాంతిఖని పాతగని ఓపెన్ కాస్టు ఆలోచనను విరమించుకోవాలని విడుదలైన లేఖపై సీపీ స్పందించారు. పత్రికల్లో, వాట్సప్ గ్రూపుల్లో కరపత్రాలు సర్క్యులేట్ చేసే వాళ్లు ఎవరనేది సమాచారం సేకరిస్తున్నామని సిపి చెప్పారు. గతంలో వచ్చిన లేఖలు వాస్తవమైనవి కావలి తమ విచారణలో తేలిందని చెప్పారు. ప్రస్తుతం ఓపెన్ కాస్ట్ విషయంలో విడుదలైన మావోయిస్టుల లేఖ విచారణ జరుగుతుందని, బాధ్యులను త్వరలోనే గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిపి శ్రీనివాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో శాంతిఖని పాతగని ఓపెన్ కాస్ట్ ను విరమించుకోవాలని విడుదలైన లేఖలు మావోయిస్టులు విడుదల చేసినవా, లేక మావోయిస్టుల పేరుతో మరెవరైనా విడుదల చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.