- ఏడు నెలల్లోనే స్థూల లాభాల్లో 36 శాతం వృద్ధి!
- గతేడాదితో పోల్చితే సుమారు రూ. 1000 కోట్లు అదనపు లాభం
- బొగ్గు అమ్మకాల ద్వారా రూ. 17,151 కోట్ల టర్నోవర్
- విద్యుత్తు అమ్మకాల ద్వారా రూ. 2,286కోట్లు ఆర్జించిన సంస్థ
హైదరాబాద్, నవంబర్ 1౬ (విజయక్రాంతి): తీవ్ర వర్షాలు, వరదలతో ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురైనా సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. గతేడాదితో పోల్చితే ప్రస్తుత సంవత్సరం ఏడు నెలల్లోనే సుమారు రూ. 1000 కోట్ల స్థూల లాభాలను సాధించింది.
ఇప్పటి వరకు బొగ్గు అమ్మకాల ద్వారా సింగరేణి రూ.17,151 కోట్ల టర్నోవర్‌ను సాధించగా విద్యుత్ అమ్మకాల ద్వారా మరో రూ.2,286 కోట్లను రాబట్టింది. ఏప్రిల్ అక్టోబర్ మధ్య పన్ను చెల్లింపునకు ముందే బొగ్గు, థర్మల్ విద్యుత్తు అమ్మకాలతో రూ. 4 వేల కోట్ల స్థూల లాభాన్ని సంస్థ ఆర్జించింది. గతేడాది ఇదే సమయానికి రూ. 2,932 కోట్లు మాత్రమే రాబట్టగా ఈ ఏడాది రూ. 1072 కోట్లు అదనంగా ఆర్జించింది. గతేడాదితో పోల్చితే స్థూల లాభంలో 36 శాతం వృద్ధి నమోదైంది.
ప్రభుత్వ ప్రోత్సాహం
సింగరేణిని మొదటి నుంచి ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది లాభాల్లో కార్మికుల వాటాగా రూ.796 కోట్లను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే దీపావళి బోనస్‌గా కార్మికులకు రూ. 358 కోట్లను చెల్లించింది. ఈ నేపథ్యంలోనే కార్మికుల రక్షణకు సింగరేణి ప్రత్యేక చొరవ చూపుతోంది.
ఈ వరుస ఘటనలు కార్మికుల్లో నూతనోత్సహాలను నింపాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, దిశా నిర్దేశంతో కంపెనీ కల్పించిన కోటి రూపాయల ప్రమాద బీమా కార్మికులల్లో ధైర్యం నింపింది. కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీ, ఇల్లందు ఏరియాలో జేకే ఓసీలకు అటవీ అనుమతులు లభించడంతో సంస్థ భవిష్యత్తుకు భరోసా లభించింది.
అలాగే సంస్థ ఛైర్మన్ ఎన్.బలరామ్ సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని గనుల రక్షణకు కమిటీలు, పిట్ కమిటీలు, వర్క్ ఇన్స్‌పెక్టర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 40 గనులకు సంబంధించిన 1500 మంది సూపర్వైజరీ సిబ్బందిని ఉద్దేశిస్తూ ఉత్పత్తి కన్నా రక్షణకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
అలాగే స్వయంగా ఏరియాల్లోని వివిధ గనులను తనిఖీ చేస్తూ సంక్షేమంపై దృష్టి సారించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.దీనితోపాటు సంస్థ తీసుకుంటున్న ఆర్థిక క్రమశిక్షణ చర్యలు, భూగర్భ గనుల్లో నష్టాలపై ఉద్యోగులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలిస్తున్నాయి.
అలాగే డిప్యూటీ సీఎం భట్టి సూచన మేరకు సింగరేణి వ్యాప్తంగా ఉజ్వల సింగరేణి పాత్ర కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్పత్తి, ఉత్పాదకత, కార్మికుల బాధ్యతలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా అన్ని ఏరియాల్లో కంపెనీ యంత్రా ల వినియోగాన్ని 14 గంటల నుంచి 20 గంటలకు పెంచేలా చర్యలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే వర్షాకాలంలో రోజుకు లక్ష టన్నులకు పడిపోయిన బొగ్గు ఉత్పత్తి తిరిగి పుంజుకుని ఇప్పుడు 2.2 లక్షల టన్నులకు చేరుకుంది. రానున్న రోజు ల్లో ఇది మరింతగా పెరిగి వార్షిక ఉత్పత్తి లక్ష్యం 720 లక్షల టన్నులకు చేరుకునేలా సీఎండీ సమీక్షలు నిర్వహిస్తున్నారు.