calender_icon.png 13 November, 2024 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి భవిష్యత్తుపై బెంగ

22-09-2024 12:22:32 AM

2027-28లో 10 గనుల మూసివేత

  1. సగానికి తగ్గనున్న బొగ్గు ఉత్పత్తి
  2. గనులు లేకపోతే మనుగడ కష్టమే
  3. తగ్గిపోనున్న ఉద్యోగుల సంఖ్య

(ఎక్కల్‌దేవి శ్రీనివాస్, బ్యూరో చీఫ్) :

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): 1889లో ఏర్పడ్డ సింగరేణి దశాబ్దాలు గా దేశాభివృద్ధికి సేవలు అందిస్తూనే ఉంది. సింగరేణి బొగ్గుకు కష్టాలు వచ్చినట్టే కనపడుతుంది. గడిచిన కొంతకాలంగా కొత్త గనుల కేటాయింపు తగ్గిపోతుండటం, అదే సమయంలో బొగ్గు నిండుకోవడంతో మూసివేస్తు న్న గనుల సంఖ్య పెరుగుతోండడంతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్న సింగరేణిలో ఉన్న ఉత్పత్తిలో సగానికి సగం తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీనితోపాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు తగ్గిపోయే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతోంది.

ప్రస్తుతం 42 గనులే..

 దేశంలోనే అత్యధిక శాతం లాభాలను ఆర్జిస్తున్న సంస్థగా సింగరేణి అవతరించింది. ప్రస్తుతం సింగరేణి పరిధిలో 22 అండర్ గ్రౌండ్ గనులు, 20 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. వీటి ద్వారా యేటా 71 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు.

కొత్త గనులు కరువు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న సంక్లిష్ట వాతావరణం, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాల ప్రభావంతో సింగరేణికి కొత్త గనుల కేటాయింపు పూర్తిగా అడుగంటి పోయింది. సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా, కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం గనుల కేటాయింపుకోసం వేలంపాటలో పాల్గొనవద్దని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక సతమతమవుతోంది. ఏటా కొత్త గనులను చేపడుతూ ఉంటే ఉత్పత్తి, ఆదాయం పెరిగి లాభాల్లో వృద్ధి కొనసాగుతుంది. కానీ గడిచిన దశాబ్ద కాలంగా కొత్త గనులు కేటాయింపు లేకపోవడంతో భవిష్యత్తులో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉండటంతో సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనున్నది.

2027 10 గనుల మూసివేత..

రాబోయే మూణ్నాలుగు సంవత్సరాలు సింగరేణి ఫరవాలేదనే దిశగానే సాగిపోతుంది. అయితే 2027 ఏకంగా 10 బొగ్గు గనులను మూసివేయనున్నారు. 2027 కిష్టారం ఓసీ, పీకేఓసీ, కేఓసీ ఆర్ ఓసీ (ఎక్స్‌పాన్షన్), కేహెచ్‌జీవోసీ, జీడీకే 11 ఇంక్లున్, వీకేపీ, కేకే 5, ఆర్‌కే 7, ఐకే 1ఏ తదితర 10 బొగ్గు గనులను బొగ్గు నిల్వలు నిండుకోవడంతో మూసివేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కేవలం రెండు కేవోసీ 3, కేటీకే ఓసీ2 యూజీ సెక్షన్ మాత్రమే కొత్తగా వచ్చి చేరుతాయి. అయితే 10 గనుల మూసివేతతో మొత్తం 28 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గుతుందని యాజమాన్యం కూడా అంచనా వేసింది. అయితే రెండు కొత్త గనుల ప్రారంభంతో కేవలం 1.30 మిలియన్ టన్నుల అదనపు ఉత్పత్తికి అవకాశం ఉంది. దీనితో రాబోయే సంవత్సరాల్లో ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపనుంది. దీనితోపాటు సింగరేణిలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యకూడా గణనీయంగా తగ్గిపోతుందని అంచనా.

ఉత్పత్తి సగానికి సగం..

కొత్త గనుల కేటాయింపు లేకపోతే 2027 తరువాత దారుణంగా బొగ్గు ఉత్పత్తి పడిపోతుందని యాజమాన్యం అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 72 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. 2027 నాటికి ఈ ఉత్పత్తి 85.35 మిలియన్ టన్నుల గరిష్టానికి చేరుకుంటుంది. ఆ సంవత్సరం 10 గనులు మూసివేయాల్సి ఉంటుంది. దీనితో మెల్లమెల్లగా బొగ్గు ఉత్పత్తి తగ్గుతూ 2032 నాటికి 58.59 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది. ఆపై 2042 నాటికి బొగ్గు ఉత్పత్తి 39.03 మిలియన్ టన్నులకు పడిపోతుంది. అంటే సగానికి సగం పడిపోతుందన్నమాట.

గనులూ తగ్గిపోనున్నాయి..

ప్రస్తుతం సింగరేణిలో 22 అండర్ గ్రౌండ్ మైన్లు, 20 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. అయితే 2024 7 గనులు మూసివేయనుండగా కేవలం మూడు మాత్రమే కొత్తగా ఏర్పడనున్నాయి. అలాగే 2025 ఒకటి మూసివేసి రెండు కొత్తవి తెరుస్తారు. 2027 మొత్తం 10 గనులు మూసివేసి రెండు మాత్రమే కొత్తవి తెరుస్తారు. 2032 మొత్తం 7 గనులు మూతపడనుండగా.. కొత్తగా 11 గనులు తెరుస్తారు. అయితే 2037 నాల్గు, 2042 మొత్తం 6 గనులు మూతపడనున్నాయి. దీంతోఆ యేడాదికి కేవలం 19 గనులు మాత్రమే సింగరేణి పరిధిలో మిగులుతాయి. 

ఉద్యోగుల తగ్గింపు..

ప్రస్తుతం సింగరేణిలో 40,994 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే 2042 నాటికి 35,665 మంది మాత్రమే ఉద్యోగులు మిగులుతారు. అంటే రాబోయే రెండు దశాబ్దాల్లో  సుమారు 5, 300 మంది ఉద్యోగులను తగ్గించాల్సి వస్తుం ది. కొత్త గనులు రాకపోతే ఈ సంఖ్యకూడా తగ్గిపోక తప్పదు. సగటున సంవత్సరానికి 250 మందికిపైగా ఉద్యోగులు సంస్థలో తగ్గిపోతుంటారు. దీనిపై ఆధారపడి పరోక్షంగా బతుకు తున్న వేలాదిమంది నిరాశ్రయులవుతారు. భవిష్యత్తును మరింత భద్రంగా రూపొందించుకోవాలంటే సింగరేణికి కొత్త గనులను కేటాయించాల్సి ఉంటుంది. కొత్త గనుల కేటాయింపుపై ఇటు సింగరేణి యాజమాన్యంతోపాటు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే సింగరేణి భవిష్యత్తు అగమ్యగోచరమే.

* తెలంగాణకు కొంగు బంగారం సింగరేణి. దక్షిణ భారతానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి భవిష్యత్తుపై బెంగ పెట్టుకుంది. కొత్త గనుల కేటాయింపు లేకపోవడం, మూసివేసే గనుల సంఖ్య పెరుగుతుండటంతో సింగరేణి భవిష్యతు ప్రమాదంలో పడేలా కనపడుతోంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కండ్లు తెరవకపోతే సిరులవేణి సింగరేణి కుంచించుకుపోవడం ఖాయంగా కనపడుతోంది. ఎలాగైనా 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉత్సాహం కనపడుతున్నా.. కొత్త గనులు కనుచూపుమేరలో కనపడడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే 2027-28 తరువాత ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. దీంతో సింగరేణిలో ఉద్యోగుల సంఖ్యకూడా గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది.