calender_icon.png 1 March, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ పనుల్లో సింగరేణి...

01-03-2025 01:33:48 AM

నాలుగు షిఫ్టులుగా ట్రాక్ పునరుద్దరణపై దృష్టి...

సిబ్బందికి అండగా ఉంటూ... బృందాలకు నాయకత్వం వహిస్తున్న సీఎండీ

మంచిర్యాల, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : ఎస్ ఎల్ బీ సీ సొరంగంలో ప్రమా దం జరిగినన తర్వాత సింగరేణి సిఎండీ బలరాం నాయక్ ఆదేశాల మేరకు సహాయక చర్యలలో సింగరేణి రెస్క్యూ బృందా లు పాల్గొంటున్నాయి. రెస్క్యూ సిబ్బందిలో మనో ధైర్యం నింపేందుకు సింగరేణి సీ అండ్ ఎండీ అక్కడే ఉంటూ బృందం మంచి, చెడులు తెలుసుకుంటూ వారికి అం డగా నిలుస్తున్నారు. గత వారం రోజులుగా రాష్ట్ర, కేంద్ర బృందాలతో కలిసి సహాయ చర్యల్లో సింగరేణి బృందం నిమగ్నమైంది. 

పనుల్లో రెస్క్యూ, సింగరేణి భూగర్భ గని కార్మికులు...

రెస్క్యూ సిబ్బందితో పాటు భూగర్భ గనిలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసే సింగరేణి కార్మికులను ఎస్ ఎల్ బీ సీ పనులకు అత్యాధునిక పరికరాలతో పంపించింది. ప్రస్తుతం 200 మందికి పైగా సింగరేణి సిబ్బంది రాష్ట్ర, కేంద్ర సహాయక బృందాలను సమన్వయం చేసుకుంటూ నిరంతరాయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బురద మట్టిని తొలగించేందుకు గురు వారం రాత్రి కొంత మంది, శుక్ర వారం మరికొంత మంది కార్మికులు శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్ నుంచి బయలుదేరి వెళ్లారు.

నాలుగు షిఫ్టులుగా ట్రాక్ పునరుద్దరణపై దృష్టి...

ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోవడం కోసమే ట్రాక్ పునరుద్ధరణ అత్యవసరం కనుక సింగరేణి రెస్క్యూ బృందాలు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. ట్రాకు పునరుద్ధరణ జరగాలంటే దానిపై కూలిన టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ.బి.ఎం) భాగాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ పనిలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది తమ వద్ద గల అత్యాధునిక గ్యాస్ కటింగ్ యంత్రాల ద్వారా ఇనుప పైపులను, గడ్డర్లను కత్తిరిస్తూ వేరు పరుస్తున్నారు. అదే సమయంలో ట్రాక్ మీద పేరుకొని ఉన్న బురద మట్టిని కూడా రెస్క్యూ బృందాలు తొలగిస్తున్నాయి. మొత్తం 250 మంది సింగరేణి రెస్క్యూ సభ్యులు 24 గంటలు ఈ పనిలో పాల్గొనేందుకు సంస్థ చైర్మన్ బలరాం నాయక్ నాలుగు షిఫ్టులకు తగిన విధంగా విభజించి, రక్షణ సూత్రాలు పాటిస్తూ పనిని సమర్థంగా పూర్తి చేయాలని రెస్క్యూ సిబ్బందికి సూచించి పంపుతున్నట్లు సమాచారం.

బృందాలకు నాయకత్వం వహిస్తున్న సీఎండీ...

ఎస్ ఎల్ బీ సీ సొరంగంలో మట్టిని తొలగించే పనులకు సింగరేణి రెస్క్యూ, భూగర్భ గనుల్లోని కార్మికులను పంపి ఆ బృందాలకు స్ఫూర్తిని నింపేందుకు రెండు రోజులుగా వారితోనే సీఎండీ బలరాం నాయక్ ఉంటున్నారు. సొరంగంలోకి జనరల్ మేనేజర్ (రెస్క్యూ) శ్రీనివాసరెడ్డితో పాటు రెస్క్యూ సభ్యులతో కలిసి లోకో రైలులో వెళ్లి పరిస్థితులను గమనిస్తూ వారికి సూచనలు చేస్తున్నారు. ఎన్. డి ఆర్.ఎఫ్ కల్నల్ తో కలిసి సింగరేణి ఛైర్మన్ 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో ప్రమాద స్థలి వరకు పరిస్థితిని సహాయక చర్యలను పరిశీలించారు. సింగరేణి రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలో జరుగుతున్న గ్యాస్ కటింగ్ పనులను ఆయన దగ్గరగా ఉండి పర్యవేక్షించారు. సంస్థ ఛైర్మన్ స్వయంగా  రెస్క్యూ  బృందాలకు  నాయకత్వం వహించడంపై కోల్ బెల్ట్ ప్రాంత వాసులు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.