calender_icon.png 22 September, 2024 | 6:58 PM

సింగరేణి సంస్థ వాస్తవ లాభాలపైన శ్వేతా పత్రం విడుదల చేయాలి

22-09-2024 05:09:14 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాలపైన శ్వేతా పత్రం విడుదల చేయాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బీఎంఎస్) శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఏరియా ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఎంఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంస్థ సాధించిన రూ. 37 వేల కోట్లు అని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది, వాస్తవ లాభాలపైన 33 శాతం చెల్లిస్తామని 16.9 శాతం చెల్లించి వాస్తవ లాభాలను పంపిణీ చేయుటలో వైఫల్యం చెందిన సింగరేణి యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సింగరేణి కార్మికుల శ్రమను ఆర్థిక దోపిడీ చేయడం సరియైన విధానం కాదన్నారు. 

2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.32 వేల కోట్ల టర్నోవర్ వచ్చిన లాభాలు రూ.2222 కోట్లు కాగా 32 శాతం రూ.711.04 కోట్లు పంపిణీ చేసిన యాజమాన్యం, అంకెల గారడితో కార్మికులను ఆర్థికంగా నష్టం చేయడం సరైన విధానం కాదన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి నికర లాభాలు రూ. 4701 కోట్లపైన రాగా 33 శాతం రూ. 796 కోట్లు ఇస్తున్నామని అసత్య ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. రూ. 4701 కోట్లు నికర లాభాలు 33 శాతం వాట రూ. 1551.33 కోట్లు పంపిణీ చేసినా రూ. 3149.67 కోట్లు అందుబాటులో ఉంటాయి, రూ. 2289 కోట్లు, తీసివేసినట్లు ప్రకటించకుండా, రూ. 2412 కోట్లు 33 %, రూ. 796 కోట్లు ఇస్తూ, రూ. 4701 కోట్లకు 33 శాతం వాటా ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.  ప్రభుత్వం, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల వైఖరి కార్మికులు గమనిస్తున్నారని, సంస్థ సాధించిన టర్నోవర్, వాస్తవ లాభాలపై సంస్థ శ్వేతా పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాగం రాజేందర్, పురుషోత్తం చారి, గూడ శ్రీకాంత్, మంద కమలాకర్, మేకల స్వామి, జెల్ల తిరుపతి, మోతె ఓదేలు, కాంపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.