calender_icon.png 8 February, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి సీఎండీ నియామకం నిబంధనలకు విరుద్ధం

08-02-2025 12:38:33 AM

  1. సంస్థ డైరెక్టర్‌గా బలరాం డిప్యూటేషన్‌పై వెళ్లారు
  2. ఆయనకు సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అభ్యంతరకరం
  3. ఎఫ్‌ఆర్-49 నిబంధన ప్రకారం అదనంగా జీత భత్యాలు చెల్లించకూడదు
  4. ప్రభుత్వ సీఎస్‌తో పాటు డీవోపీటీకి న్యాయవాది ఫిర్యాదు

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాం తి): సింగరేణి సీఎండీగా ఎన్. బలరాంకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని కొత్తగూడేనికి చెందిన న్యాయవాది జీకే సంపత్‌కుమార్ తాజాగా రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

అలాగే నియామ కాలపై ప్రభుత్వ జీవోలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ఉత్తర్వుల కాపీలను సైతం ఫిర్యాదుకు జతచేశారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశా ల ప్రకారం.. “ఎన్.బలరాం ఐఆర్‌ఎస్ అధికారి. ఆయన డిప్యుటేషన్‌పై సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్)గా విధులు నిర్వ ర్తించారు. సింగరేణి సీఎండీ ఆయన 1జనవరి 2024న పూర్తి అదనపు బాధ్య తలు (ఎఫ్‌ఏసీ) తీసుకున్నారు.

ట్రైపార్టీ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ఆయ న నియామకం సరికాదు. గతంలో కుదుర్చుకున్న ట్రైపార్టీ అగ్రిమెంట్‌ను రాష్ట్రప్రభుత్వం తుంగలో తొక్కింది. ఒప్పందం ప్రకారం అన్ని అర్హతలున్న అధికారిని సీఎండీగా నియమించవచ్చని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ముందే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

మొదట మూడు సంవత్సరాలు లేదా ఆపై మరో రెండు సంవత్సరాల పాటు ఒకే అధికారిని సీఎండీగా కొనసాగించవచ్చు” అని న్యాయవాది పేర్కొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డీవోపీటీ సెక్రటరీకి పంపించిన ఫిర్యాదులో ఓఎం నంబర్ 4/2/89-ఎస్టాబ్లిష్.(పేజీ నంబర్ 2),  తేదీ: 11 ఆగస్టు 1989 నాటి ఉత్తర్వులను సైతం న్యాయవాది ఉదాహరించారు.

ఎఫ్‌ఆర్ 49 నిబంధన ప్రకారం.. అదనపు బాధ్యతలకు అదనంగా ఎలాంటి జీతభత్యాలు చెల్లించకూడదని పేర్కొన్నారు. సీఎండీగా నియమితులై వారు ఏయే అంశాలను చూడాల్సి ఉంటుంది.. ఏయే అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదో ముందే స్పష్టం చెప్పాల్సి ఉందని, కానీ.. బలరాం నియామకంలో ఈ నిర్దేశకాలేమీ లేవని న్యాయవాది చెప్తున్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలకు పూర్తిస్థాయి అధికారులను నియమించాలని,  అత్యవసరమైతే ఓ అధికారిని కొద్దిరోజులు అదనపు బాధ్యతలు అప్పగించవచ్చని, కానీ.. సింగరేణి డైరెక్టర్‌గా డిప్యుటేషన్ బలరాం డిప్యూటేషన్‌పై వెళ్లారని, ఆ డిప్యూటేషన్ కాలం మరింత పెంచడంతో, దాని ఆధారంగా ఎఫ్‌ఏసీని 2025 డిసెంబర్ 4 వరకు సీఎండీగా పొడిగించడాన్ని న్యాయవాది ఎత్తిచూపుతున్నారు. బలరాం నియామకంపై డీవోపీటీ నుంచి కూడా ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని ఫిర్యాదులో పేర్కొన్నారు.