మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు సామాజిక సేవలో ముందు నిలుస్తుందని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జీ.దేవేందర్ స్పష్టం చేశారు. ఏరియాలోని వృత్తి శిక్షణ కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి జీ.దేవేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సింగరేణిలో కారుణ్య నియామకాల ద్వారా నియామకమైన నూతన కార్మికులు, గనులు, డిపార్ట్మెంట్ల కార్మికులతో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. గతంలో వృత్తి శిక్షణ కేంద్రంలో అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించినట్లు జీ.దేవేందర్ గుర్తు చేశారు. జిల్లాలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాదిగ్రస్థులు అధికంగా ఉన్నారని, వీరికి ప్రతినెల రక్తం అవసరం ఉంటుందని తెలిపారు. ప్రతినెల వీరికి రక్తదాన శిబిరాలు నిర్వహించేలా కృషి చేస్తామని, రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలను అభినందించారు.