calender_icon.png 4 March, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాపార విస్తరణలో సింగరేణి దూకుడు

04-03-2025 02:08:53 AM

  1. రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్‌తో సంయుక్తంగా ప్లాంట్ల నిర్మాణం
  2. 3,100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి ప్రణాళిక
  3. 74: 26 నిష్పత్తిలో పెట్టుబడులు
  4. రాజస్థాన్ సీఎం, తెలంగాణ డిప్యూటీ సీఎం సమక్షంలో సంస్థల ఒప్పందాలు

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే రారాజుగా వెలుగొందుతున్న సింగరేణి వ్యాపార విస్తరణలో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నది. తాజాగా మరో ముందడుగు వేసింది. 3,100 మెగావాట్ల సోలార్, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సై.. అంటూ రాజస్థాన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది.

సోమవారం ఈ మేరకు జైపూర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, తెలంగాణ డిప్యూ టీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సమక్షంలో సింగరేణి, రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీయూఎన్‌ఎల్) సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందం చారిత్రక ఘట్టమ ని డిప్యూటీ సీఎం భట్టి అభివర్ణించారు.

రాజస్థాన్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి కేరాఫ్ అని, అలాంటి రాష్ట్రంతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందాన్నిచ్చిందని వెల్లడించారు. ఈ సందర్భం గా రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ్ మాట్లాడుతూ..

ఇప్పటివరకు తమ రాష్ట్రం విద్యుత్తు శాఖ, కోల్ ఇండియా అనుబంధ సంస్థలతో మాత్రమే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నదని, ఇప్పుడు దక్షిణాదిలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణితో ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు.

రానున్న కాలంలో సింగరేణి సంస్థతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో రాజస్థాన్ ఇంధన శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అలోక్, తెలంగాణ ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, డైరెక్టర్ డి.సత్యనారాయణరావు పాల్గొన్నారు. 

మారనున్న సింగరేణి ముఖచిత్రం..

సింగరేణి సంస్థ ఒకవైపు బొగ్గు ఉత్పత్తి చేస్తూ నే.. మరోవైపు థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లోనూ అడుగుపెట్టింది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని జైపూర్‌లో 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేసింది. త్వర లో అదే ప్రదేశంలో మరో 800 మెగావాట్ల థర్మ ల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

2026 నాటికి 450 మెగావాట్లకుపైగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి నెట్ జీరో కంపెనీగా ఎదగాలని ప్రణాళికలు రచిస్తున్నది. మరోవైపు ఒడి శాలోని నైనీ గని నుంచి ఏడాదికి కోటి టన్నుల బొగ్గు చొప్పున ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది. నెలరోజుల్లో అక్కడ బొగ్గు ఉత్పత్తి ప్రారంభంకానున్నది.

రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఇదే ప్రాంతంలో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నది.

విద్యుత్తు అవసరాలు తీర్చడంలో కీలకం..

తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల విద్యుత్తు అవసరాలు తీర్చడంలో ఈ ఒప్పందం కీలకం గా మారనుంది. రెండు సంస్థలు సంయుక్తంగా 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు, 1,500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నాయి. ప్లాంట్లకు మొత్తం పెట్టుబడిలో సింగరేణి సంస్థ 74 శాతం, రాజస్థాన్ ప్రభుత్వం 26 శాతం వాటా చెల్లించనున్నాయి.

రాజస్థాన్ ప్రభుత్వం తన వాటా కింద విద్యుత్తు ప్లాంట్లకు అవసరమైన స్థలాలు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నది. సింగరేణి తన వాటాను ధన రూపంలో చెల్లించనున్నది. మున్ముందు ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి డిస్కంలతో ఒప్పందాలను అక్కడి ప్రభుత్వం చూసు కోనున్నది.