calender_icon.png 22 September, 2024 | 3:03 AM

మహా శాస్త్రకవి సర్వజ్ఞుడు సింగభూపాలుడు

15-07-2024 12:00:00 AM

గన్నమరాజు గిరిజా మనోహరబాబు :

“దీనార టంకాల తీర్థమాడించితి

దక్షిణాధీశు ముత్యాలశాల

పలుకు తోడైతాంధ్ర భాషామహాకావ్య

నైషధగ్రంథ సందర్భమునను

పగులగొట్టించి తుద్భట వివాదప్రౌఢి

గౌడ డిండిమభట్టు కంచుఢక్క

చంద్ర భూపక్రియాశక్తి రాయలయొద్ద

పాదుకొల్పితి సార్వభౌమ బిరుదు

నెటుల మెప్పించెదో నన్ను నింకమీద

రావుసింగ మహీపాలు ధీవిశాలు

నిండు కొలువున నెలకొని యుండి నీవు

సరస సద్గుణ నికురుంబ శారదాంబ” 

అంటూ కవి సార్వభౌముడు, సకలశాస్త్ర పారంగతుడు, తెలుగు సాహిత్యాకాశంలో ఎప్పటికీ వెలుగులు చిమ్మే దివ్యమైన తారయైన శ్రీనాథ మహాకవీ రాచకొండ రాజైన సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానానికి వెళ్లే సందర్భంలో చేసిన సరస్వతీ స్తుతి ఇది. దీనిని పరిశీలిస్తే సర్వజ్ఞ సింగభూపాలుని ప్రతిభా పాండిత్యాలు ఎంతటి స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. సాధారణంగా మనకు చరిత్రలో నన్నెచోడుడు, శ్రీకృష్ణదేవరాయలు, రఘునాథ నాయకుడు మొదలైన రాజకవులు కనిపిస్తారు. కాని, అలంకార శాస్త్రాలనో, లక్షణ శాస్త్రాలనో రాసిన పాలకులు ఎక్కువగా కనిపించరు. సర్వజ్ఞ సింగభూపాలుడు రేచర్ల వంశంలో జన్మించిన పద్మనాయక ప్రభువు. ఆయన మహాపాలకునిగా కీర్తి పొందిన పండితుడైన రాజు. తన ఆస్థానంలో ఎందరో కవి పండితులను పోషించిన వాడే గాకుండా స్వయంగా గొప్ప అలంకార శాస్త్ర రచన చేసిన మహా అలంకారికునిగా సాహితీ లోకంలో అనంత కీర్తిని పొందినవాడు.

పద్మనాయక రాజ్యానికి అంకురార్పణ

అఖండమైన తెలుగునేలపై వెలిగిన కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ పాలకుల కారణంగా ఓడిపోయిన అనంతరం వచ్చిన పరాయి పాలకులను ఎదిరించి నిలిచి పోరాడిన అనేకమంది కాకతీయుని సామంతులలో పద్మనాయక రాజులు కూడా భాగస్వాములైనారు. ముసునూరి కాపయ నాయకత్వంలో ఈ పోరాటాలు కొనసాగాయి. ఈ కారణంగానే కొంతకాలం పాటు తెలుగు ప్రాంతానికి ఢిల్లీ పాలకుల ప్రమాదం తగ్గింది. తదనంతరం రేచర్ల మొదటి సింగమ నాయకుడు రాచకొండ కేంద్రంగా పాలిస్తూ స్వాతంత్య్రం ప్రకటించుకొని తన రాజ్యాన్ని కృష్ణా నదీతీరం వరకు విస్తరింపజేసి ‘పద్మనాయక’ రాజ్యానికి అంకురార్పణ చేశాడు. ఈ విధంగానే రెడ్డిరాజులు, విజయనగర రాజులు కూడా తమతమ స్వతంత్ర రాజ్యాలను ఏర్పరచుకున్నారు. ఈ రకంగా తెలుగువారిని పాలించే మూడు ప్రధాన రాజ్యాలు దక్షిణ భారతంలో ఏర్పడ్డాయి. మొదటి సింగమ నాయకుని అనంతరం అనపోత నాయకుడు పాలకుడైనాడు. తన తమ్ముడైన మాదానాయుని దేవరకొండ పాలకునిగా నియమించాడు. నాటినుంచి అనపోత నాయకుని వారసులు రాచకొండలోను, మాదా నాయకుని వారసులు దేవరకొండలోను పాలకులుగా స్థిరపడ్డారు.

‘సర్వజ్ఞ’ బిరుదాంకితుడు

అనపోత నాయకుని తరువాత క్రీ.శ.1384 నుండి ఈ పద్మనాయక రాజ్యానికి సింగభూపాలుడు పాలకుడుగా వచ్చాడు. ‘కుమార సింగ భూపాలుడు’గానూ పేరొందిన ఈ సింగభూపాలునికి ‘సర్వజ్ఞ’ అనే బిరుదు ఉంది. ఈయన సమర్థ పాలకుడేగాక గొప్ప సాహితీవేత్త, మహాజ్ఞాని, సాహిత్య పోషకుడు కూడా. దీనివల్లే శాకల్య మల్లన, విశ్వేశ్వర కవి, పశుపతి పండితుడు, ఈయన కుమారుడు నాగనాథుడు, అమరసింహుని ‘అమరకోశాని’కి వ్యాఖ్య రచించిన బొమ్మకంటి అప్పయామాత్యుని వంటి ఎందరో కవులు, విద్వాంసులు ఈ సర్వజ్ఞ సింగభూపాలునివల్లే ఆదరణ పొందారు. విశ్వేశ్వరకవి ‘చమత్కార చంద్రిక’ అనే గొప్ప గ్రంథాన్ని అందించిన  పండితుడు. అందులో పలు సందర్భాలలో సింగభూపాలుని నాయకత్వాన్ని ప్రశంసించడం విశేషం.

సుప్రసిద్ధ అలంకారికుల సరసన..

పద్మనాయక రాజుల చరిత్రపై ప్రసిద్ధ రచయితలైన మల్లంపల్లి సోమశేఖరశర్మ, ఖండవల్లి లక్ష్మీరంజనం, ఆరుద్ర వంటి పెద్దలెందరో అనేక విశేషాలు అందించారు. పద్మనాయక రాజులలో మిక్కిలి ప్రసిద్ధుడైన సింగభూపాలుడు ఒకవైపు పాలన కొనసాగిస్తూనే మరోవైపు రచనా వ్యాపకాన్ని కొనసాగించాడు. సాహిత్య రంగంలోను తనదైన ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. సుప్రసిద్ధ ఆలంకారికుల సరసన చేరే రీతిలో వారు ‘రసార్ణవ సుధాకరము’ అనే గొప్ప అలంకార శాస్త్రాన్ని సంస్కృతంలో రచించాడు. భరతుని నాట్యశాస్త్ర స్థాయిలో ఈ అలంకార శాస్త్రానికి కీర్తి దక్కింది. ఇదేగాక శార్ఙదేవుడు రచించిన ‘సంగీత రత్నాకరాని’కి ‘సంగీత సుధాకరము’ అనే పేరుతో గొప్ప వ్యాఖ్యానాన్ని కూడా రాశాడు. ఇంకా ‘కువలయావళి’ అనే నామాంతరం గల ‘రత్న పాంచాలిక’ నాటకాన్ని, నాటక భేదంగా పరిగణించే భాణముగా ‘కందర్ప సంభవం’ అనే ఒక భాణాన్ని కూడా రచించిన ప్రతిభాశాలి సింగభూపాలుడు.

ఈయన ఆస్థాన కవియైన విశ్వేశ్వర కవి ‘చమత్కార చంద్రిక’, ‘వీరభద్ర విజృంభణము’, ‘కందర్ప సంభవము’, ‘కరుణా కందళము’ వంటి గ్రంథములు రచించాడు. బొమ్మకంటి అప్పయార్యుడు కూడా ‘అమరకోశాని’కి వ్యాఖ్యానాన్ని రచించాడు. సింగభూపాలుని కుమారుడైన రావు మాదానేడు కూడా రచయిత కావడం విశేషం. ఆయన శ్రీమద్రామాయణానికి ‘రాఘవీయము’ అనే వ్యాఖ్య రాసినట్లు ఈయన భార్య ‘నాగాంబిక’ వేయించిన నాగారం శాసన శ్లోకాలవల్ల తెలుస్తున్నది. ఈ విషయాన్ని ఇటీవల ‘తెలంగాణ సాహిత్య అకాడెమి’ ప్రచురించిన రసార్ణవ సుధాకర పరిష్కర్త, సంపాదకులు, సుప్రసిద్ధ పరిశోధకులు డా.శ్రీరంగాచార్య గ్రంథపీఠికలో తెలియజేశారు. అంటే, పద్మనాయక రాజులు సమర్థులైన పరిపాలనాదక్షులే గాక, మహావిద్వన్మూర్తులని, ముఖ్యంగా సంస్కృత సాహిత్యాన్ని మథించి అపురూపమైన, ప్రామాణికమైన రచనలు చేసిన వారేనని స్పష్టమవుతున్నది.

ప్రామాణిక లక్షణ గ్రంథం

సర్వజ్ఞ సింగభూపాలుని ‘రసార్ణవ సుధాకరము’ను పరిశీలించినప్పుడు ఆయన ఎంతటి మహా పరిశోధకుడో, ఎన్నెన్ని గ్రంథాలను అధ్యయనం చేశాడో అన్న సంగతి ఎంతో గొప్పగా అవగాహనకు వస్తుంది. అప్పటికే ప్రచారంలో వున్న పలు లక్షణ గ్రంథాలను కూడా సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరమే ఈ రచన చేసినట్లుగా మనకు పరిశీలకులకు బోధపడుతుంది. ‘దశరూపక కర్తయైన ధనంజయుని కూడా విభేదించి కొత్తకొత్త ప్రతిపాదనలను సహేతుకంగా పలు ప్రసిద్ధ కృతులలోని ప్రమాణాలతో నిరూపించిన ప్రామాణిక లక్షణ గ్రంథకర్త సింగభూపాలుడని’ నిస్సంశయంగా చెప్పవచ్చు. తన సమకాలీన కవులు, శాస్త్రకారులు సైతం ఈ ‘రసార్ణవ సుధాకరాన్ని’, ఈయన రచించిన ‘కువలయావళి’ నాటకం, సంగీత రత్నాకర వ్యాఖ్యలను ప్రస్తావించడమే వీటి ప్రాభవానికి నిదర్శనం. 

మూడు ఉల్లాసాలుగా ‘రసార్ణవ సుధాకరము’

‘రసార్ణవ సుధాకరము’లో మూడు ఉల్లాసాలున్నాయి. అధ్యాయాలను ‘ఉల్లాసాలు’గా రచయిత పేర్కొన్నాడు. మూడింటిలోనూ ప్రధాన విషయం నాట్యశాస్త్ర సంబంధమే. ముఖ్యంగా భరతుడు, కోహలుడు, దత్తిలుడు మొదలైన శాస్త్రకారులు చెప్పిన విషయాలను సులభతరం చేసి చెప్పే ప్రయత్నం చేశాడు సింగభూపతి. ధనంజయుని దశరూపక విశేషాలను కొన్నిచోట్ల విస్తరించి చెప్పాడు. మరికొన్ని చోట్ల ఆయన భావాలతో విభేదించాడు. సింగ భూపాలుడు లక్షణ శ్లోకాలను చెప్పి లక్ష్యాలుగా అనేకమంది మహాకవుల రచనలను ప్రామాణిక రీతిలో చెప్పడాన్నిబట్టి ఆ ప్రతిభామూర్తి గ్రంథ అవగాహనా ప్రతిభ ద్యోతకమవుతుంది. సింగ భూపాలుడు కొన్నికొన్ని సందర్భాలలో భరతమునిని కూడా విభేదించాడు. భరతుడు ‘నాటకానికి వస్తువే ముఖ్యమని’ భావించాడు. కాని, సింగ భూపాలుడు ‘చమత్కృతి జనకమైన వస్తువే నాటకానికి ప్రధానమని’ అభిప్రాయపడ్డాడు. కాళిదాసు, భవభూతి, మురారి వంటి ప్రాచీన మహాకవుల రచనల నుండి తన లక్షణాలకు లక్ష్యాలను చూపించాడు కనుకనే వ్యాఖ్యాతృ సార్వభౌముడైన మల్లినాథ సూరి వంటి మహనీయుడు తన వ్యాఖ్యానాల్లో ఈ గ్రంథాన్ని ప్రస్తావించాడు.

మూడు ఉల్లాసములుగా రచింపబడిన ఈ అలంకారణ శాస్త్రంలో మొదటి ఉల్లాసములో నాయికా నాయక లక్షణాలు, దానిలోని భేదాలు, శృంగార రస విభావాలు, రీతులు, గుణములు, వృత్తులు, సాత్విక భావాలు లక్ష్య లక్షణా సహితంగా పొందు పరుపరిచి వున్నాయి. రెండో ఉల్లాసంలో సంచారి భావాలు, రసాశ్రయ వివేకము, సంభోగ విప్రలంభ శృంగార రస భేదాలు, కరుణ రస విచారము నిరూపితమైనాయి. మూడో ఉల్లాసంలో నాట్య స్వరూపం, లాస్యాంగాలు, దశవిధ రూపణ, దాని అంగాలు, మొదలైన విషయాలను వివిధ దృశ్య కావ్య విషయాలు వున్నాయి.

“సర్వజ్ఞ నామ బిరుదము

శర్వునకే, రావు సింగ జనపాలునకే

యుర్విం జెల్లును, తక్కొరు

సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే!”

అంటూ చేసిన ప్రశంస సంపూర్ణమైన 

అక్షర సత్యమే.

వ్యాసకర్త సెల్: 9949013448

అది ఆస్థాన కవి రచన కాదు!

‘రసార్ణవ సుధాకరము’ను సింగ భూపాలుని ఆస్థాన కవియైన విశ్వేశ్వర కవియే రచించి తమ రాజు పేర దానిని ప్రచారంలోకి తెచ్చినట్లు కొందరు కొన్ని వాదాలు లేవనెత్తారు. కానీ, చిలుకూరి పాపయ్య శాస్త్రి వంటి సద్విమర్శకులు, ఈ కృతిని తెలుగులోకి అనువదించిన ప్రముఖ పండితులు బులుసు వెంకట రమణయ్య మొదలైన పెద్దలు ‘ఇది సింగ భూపాలుని రచనే’ అని నిర్ధారించారు. దానికి తగిన ప్రమాణాలను ఈ గ్రంథం ద్వారానే చూపించి, నిరూపించారు. ఇందులో సింగ భూపాలుని ప్రశంస ‘తానే స్వయంగా ఏ విధంగా చేస్తాడన్న’ వాదనలకు ఇది కవుల సహజ లక్షణమని చెప్పి సమర్థించారు.