calender_icon.png 21 December, 2024 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింధూ ఈసారైనా

15-10-2024 01:55:21 AM

  1. నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్ 
  2. బరిలో లక్ష్యసేన్, మాళవిక

ఒడెన్స్ (డెన్మార్క్): భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి సిద్ధమయ్యారు. గత వారం జరిగిన ఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధూ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగి పూర్తిగా నిరాశపరచగా.. లక్ష్యసేన్ రెండో రౌండ్‌లోనే ఇంటిబాట పట్టాడు.

ఏడాది కాలంగా పెద్దగా ఫామ్‌లో లేకపోయినప్పటికీ గతంలో డెన్మార్క్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలవడంతో తెలుగుతేజంపై మంచి అంచనాలున్నాయి. నేడు జరగనున్న తొలి రౌండ్‌లో సింధూ చైనీస్ తైపీకి చెందిన పై యూ పోను ఎదుర్కోనుంది. తొలి రౌండ్ అధిగమిస్తే రెండో రౌండ్‌లో చైనా స్టార్ షట్లర్ హాన్ యూ ఎదురయ్యే అవకాశముంది.

సింధూతో పాటు మహిళల సింగిల్స్ విభాగంలో మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడాలు బరిలో ఉన్నారు. ఇటీవలే చైనా ఓపెన్‌లో క్వార్టర్స్ చేరి సంచలనం సృష్టించిన మాళవిక డెన్మార్క్ ఓపెన్‌లో అదరగొట్టాలని చూస్తోంది. నేడు జరగనున్న తొలి రౌండ్‌లో బన్సోద్ వియత్నాంకు చెందిన గెయెన్ లిన్హ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఇక ఆకర్షి కశ్యప్ అమెరికా షట్లర్ లారెన్ లామ్‌ను ఎదుర్కోనుంది. 

టైటిల్ కొట్టాల్సిందే..

పారిస్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకం మిస్ చేసుకున్న లక్ష్యసేన్ డెన్మార్క్ ఓపెన్‌లోనైనా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని కోరుకుందాం. ఇక లక్ష్యసేన్ తొలి రౌండ్‌లో చైనాకు చెందిన లు గువాంగ్ జూను ఎదుర్కోనున్నాడు. అయితే రెండో రౌండ్‌లోనే ఇండోనేషియాకు చెందిన జొనాథన్ క్రిస్టీ రూపంలో లక్ష్యసేన్‌కు కఠిన ప్రత్యర్థి ఎదురవనున్నాడు.

ఇక డబుల్స్ విభాగంలో పురుషుల విభాగంలో భారత్ నుంచి పోటీలో ఎవరు లేరు. మహిళల డబుల్స్‌లో గాయత్రి జాలీ జంటతో పాటు రుతుపర్ణ శ్వేత పర్ణ జోడీ బరిలోకి దిగుతున్నాయి. ఇక మిక్సడ్ డబుల్స్ విభాగంలో హైదరాబాదీ జంట సుమిత్ తొలి రౌండ్‌లో కెవిన్ లీటూ జాంగ్ (కెనడా), సతీశ్ వరియత్ జంట ఇండోనేషియా ద్వయం రిహాన్ తలపడనుంది.