calender_icon.png 15 January, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిక్వార్టర్స్‌లో సింధు

01-08-2024 02:43:20 AM

  1. ఒలింపిక్స్‌లో భారత షట్లర్ల జోరు
  2. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ సంచలనం
  3. ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన ఆకుల శ్రీజ

ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో ఐదో రోజు భారత అథ్లెట్లు పాల్గొన్న అన్ని ఈవెంట్స్‌లోనూ సానుకూల ఫలితాలే వచ్చాయి. విశ్వక్రీడల్లో మూడో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌కు చేరుకోగా.. పురుషుల విభాగంలో లక్ష్యసేన్ కూడా ముందంజ వేశాడు. బాక్సింగ్ విభాగంలో టోక్యో పతక విజేత లవ్లీనా బొర్గొహై క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. టేబుల్ టెన్నిస్‌లో తెలుగు ప్యాడ్లర్ ఆకుల శ్రీజ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లి సంచలనం సృష్టించింది. ఇక పురుషుల 50 మీటర్ల రైఫిల్ పొజిషన్స్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన స్వప్నిల్ కుసాలే పతకంపై ఆశలు రేపుతున్నాడు..

పారిస్: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఐదో రోజు తమ హవా కొనసాగించారు. పాల్గొన్న ప్రతి ఈవెంట్‌లో మన అథ్లెట్లు కనీసం క్వార్టర్స్ లేదా ప్రిక్వార్టర్స్ చేరుకొని పతకాలపై ఆశలు పెంచుతున్నారు. బ్యాడ్మింటన్‌లో తెలుగు షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం గ్రూప్ మ్యాచ్‌లో సింధూ 21 21 ఎస్తోనియాకు చెందిన కూబా క్రిస్టిన్‌పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. 33 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసిన సింధూ ఆత్మవిశ్వాసంతో ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తొలి గేమ్‌లో సింధూకు కనీస పోటీ ఇవ్వలేకపోయిన క్రిస్టిన్ రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది.

మ్యాచ్ ఆద్యంతం భారీ స్మాష్‌లతో విరుచుకుపడిన సింధూ క్రిస్టిన్‌పై అలవోక విజయాన్ని సాధించింది. మ్యాచ్‌లో సింధూ 3 మ్యాచ్ పాయింట్లు గెలుచుకోగా.. క్రిస్టిన్ సున్నాకే పరిమితమైంది. ఇక 2016, 2020 ఒలింపిక్స్ పతక విజేత అయిన సింధూ ఈసారి స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగినట్లు ఆరంభంలోనే పేర్కొంది. గ్రూప్ దశను విజయవంతంగా దాటిన సింధూకు అసలు పరీక్ష ప్రిక్వార్టర్స్ నుంచే ఎదురుకానుంది. సింధూకు కొరకరాని కొయ్యగా మారిన చైనా షట్లర్లను ఎదుర్కోవాల్సి ఉంది. తనదైన రోజున ఎంతటి కఠిన ప్రత్యర్థినైనా మట్టికరిపించగల సత్తా సింధూ సొంతం. దీంతో ఈసారి కచ్చితంగా పసిడి సాధిస్తుందనే ధీమాను కలిగిస్తోంది.

లక్ష్యసేన్ సంచలనం

పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ తన జోరును కొనసాగిస్తున్నాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న లక్ష్యసేన్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ పతకం దిశగా అడుగులు వేస్తున్నాడు. తాజాగా గ్రూప్ చివరి మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21 21 ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)పై సంచలన విజయాన్ని నమోదు చేసుకొని ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన లక్ష్యసేన్ అజేయంగా రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లాడు. ఇక ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ భారత సహచర షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ఎదురయ్యే అవకాశముంది.  

ప్రిక్వార్టర్స్‌లో శ్రీజ

పారిస్: తెలుగు ప్యాడ్లర్ ఆకుల శ్రీజ ఒలింపిక్స్‌లో అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తుంది. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో శ్రీజ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బుధవారం టీటీ రౌండ్ ఆఫ్ 32లో శ్రీజ 4 సింగపూర్‌కు చెందిన జెంగ్ జియాన్‌ను చిత్తు చేసింది. ఆరు గేముల పాటు సాగిన మ్యాచ్‌లో శ్రీజ 11 10 4 5 12 10 జెంగ్ జియాన్‌పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం 51 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో శ్రీజ నాలుగింటిలో విజయం సాధించగా.. జెంగ్ రెండు గేమ్స్‌కే పరిమితమైంది. తొలి మ్యాచ్‌లో శ్రీజ స్వీడన్‌కు చెందిన క్రిస్టినా కాల్‌బర్గ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. నేడు జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో శ్రీజ చైనాకు చెందిన సున్ యింగ్ షాను ఎదుర్కోనుంది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఓరుగల్లు చిన్నది 2022 కామన్ వెల్త్ గేమ్స్‌లో శరత్ కమల్‌తో కలిసి స్వర్ణ పత కం కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.

అనూష్‌కు నిరాశే

పారిస్: ఒలింపిక్స్‌లో ఈక్వెస్ట్రియన్ క్రీడ లో భారత్ తరపున బరిలోకి దిగిన అనూష్ అగర్వాలా పోరాటం ముగిసింది. బుధవా రం జరిగిన డ్రెస్సేజ్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే అనూష్ ఇంటిబా ట పట్టాడు. గ్రూప్ నాలుగో స్థానం నుంచి తన పోటీ ప్రారంభించిన అనూష్ 66.44 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రతీ గ్రూప్ నుంచి టాప్ నిలిచిన అథ్లెట్లు మరుసటి రౌండ్‌కు అర్హత సాధించనున్నారు. 2022 ఆసియా గేమ్స్‌లో ఈక్వెస్ట్రియన్‌లో స్వర్ణం సాధించిన అనూష్ అగర్వాలా ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. 

నేడు ఒలింపిక్స్‌లో భారతీయం

గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత ఫైనల్స్: గగన్‌జీత్ బుల్లర్, శుభాంకర్ శర్మ

షూటింగ్:  పురుషుల 50 మీ రైఫిల్ 3 పొజిషన్ ఫైనల్: స్వప్నిల్ కుసాలే

మహిళల 50 మీ రైఫిల్ 3 పొజిషన్ క్వాలిఫికేషన్ రౌండ్: సిఫ్త్ కౌర్, అంజుమ్ మౌద్గిల్

హాకీ: భారత్ x బెల్జియం (గ్రూప్ మ్యాచ్)

బాక్సింగ్: మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్: నిఖత్ జరీన్ x యూ వూ (చైనా)

ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత (1/32 రౌండ్): ప్రవీణ్ జాదవ్ x కావో వెన్‌చాకో (చైనా)

టేబుల్ టెన్నిస్ (క్వార్టర్ ఫైనల్స్): ఆకు ల శ్రీజ x సున్ యింగ్ షా (చైనా)

సెయిలింగ్ పోటీలు: పురుషుల డింగీ రేస్ 1: విష్ణు శరవణన్

మహిళల డింగీ రేస్ 1: నేత్ర కుమారన్