calender_icon.png 2 April, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగాదిని ఎప్పటినుంచి జరుపుకుంటున్నాం?

30-03-2025 12:00:00 AM

తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుంచి మొదలవుతుంది. ఇది తెలుగు వారి తొలి పండుగ. ఈ పండుగను రెండు తెలుగు రాష్ట్రాల వారు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇంటిని చక్కగా అలంకరించుకుని దేవుడికి పూజ చేసుకుని.. ఆలయాలకు వెళ్లొస్తారు. అసలు ఈ ఉగాది పండుగను ఎప్పటి నుంచి నిర్వహించుకుంటున్నాం? ఎన్ని శతాబ్దాలుగా నిర్వహించుకుంటున్నాం? అనే విషయాలు తెలుసుకుందాం. ఉగాది పండుగ శాతవాహన రాజవంశం కాలం నుంచి జరుపుకుంటున్నట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. శాతవాహన రాజవంశం 230 బీసీ నుంచి 220 ఏడీ దాకా ఉంది.

ప్రస్తుతమున్న తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను వీళ్లు పాలించారు. అప్పటి గ్రంథాలు శాసనాల్లో ఉగాది గురించి ప్రస్తావన ఉంది. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయించుకుంటే మంచిదని చెబుతారు. పూర్వ కాలంలో అయితే ఉగాది రోజు విసనకర్రని కొనేవారు. ప్రస్తుతం బట్టలు, ఆభరణాలు కొంటున్నారు. ఇవి కొనలేని వారు కొత్త గొడుగు కొన్నా కూడా మంచిదేనట.

పంచాంగ శ్రవణం

ఉగాది పండుగ అంటేనే ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం వంటివి గుర్తొస్తాయి. మిగిలిన పండుగ తంతు అంతా ప్రాంతాన్ని బట్టి మారినా కూడా ఈ రెండు విషయాల్లో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మార్పూ ఉండదు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృతయుగం ఆరంభమైంది. ఈ ఉగాది పండుగ వెనుకున్న పురాణ గాధ ఏంటంటే.. శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుని సంహరించి బ్రహ్మదేవునికి అప్పగించాడు. ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని విష్ణుమూర్తి ప్రీత్యర్థం ‘ఉగాది’ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు విశాల విశ్వాన్ని సృష్టించాడు. బ్రహ్మ సృష్టికి సంకేతంగా ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీ.

ఉగాది రోజు సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం కన్నుల పండువగా జరుగుతుంది. దీని ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి? దేశంలో పంటలు ఎలా పండుతాయి? వర్షాలెలా కురుస్తాయి? వంటి అనేక అంశాలను తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు కూడా తెలుసుకోగలుగుతాం. తద్వారా కలిగే బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. మొత్తంగా ఈ పంచాంగ శ్రవణం సకల పాపాలను హరించి వేస్తుందని చెబుతారు.