calender_icon.png 31 October, 2024 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగుజాతి గర్వించే కవి సినారె

30-07-2024 01:37:10 AM

  1. ఆయన రచనలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి
  2. సినారె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
  3. ఓ విద్యాసంస్థకు ఆయన పేరు పెడతాం
  4. నంది అంత గొప్పగా గద్దర్ అవార్డులిస్తాం 
  5. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
  6. తమిళ రచయిత్రి శివశంకరికి  సినారె జాతీయ పురస్కారం ప్రదానం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 29 (విజయక్రాంతి): తెలుగుజాతి గర్వించే కవి సినారె (డాక్టర్ సి నారాయణరెడ్డి) అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. త్వరలో సినారె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలోని ఏదైనా ఒక విద్యాసంస్థకు ఆయన పేరు పెడతామని ప్రకటించారు. ప్రజాజీవితంలో మాజీ సీఎం ఎన్టీఆర్ ప్రసంగాల్లో సినారె ముద్ర చెరగనిదని గుర్తుచేశా రు. నంది అవార్డుల అంత గొప్పగా డిసెంబర్ 9న గద్దర్ అవార్డులు అందజేస్తామని స్పష్టంచేశారు.

సినారె 93వ జయంతి వేడుకలు నగరంలోని రవీంద్రభారతిలో ఘనం గా జరిగాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుశీల సి నారాయణరెడ్డి ట్రస్టు వారు అందజేస్తున్న జ్ఞానపీఠ అవార్డుగ్రహీత, విశ్వంభర డా.సినారె జాతీయ సాహిత్య పురస్కార గ్రహీత శివశంకరిని సన్మానించారు. ఆమెకు పురస్కారాన్ని, రూ.5లక్షల నగదు, జ్ఞాపికను అందజేశారు. అనంతరం సమన్వితం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కవిగా, గాయకుడిగా, అధ్యాపకుడిగా, వీసీగా, రాజ్యసభ సభ్యుడిగా సినారె మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు ప్రజల పట్ల సినారె నిబద్ధతను మరువలేమని చెప్పారు. మారుమూల పల్లె నుంచి తెలుగు జాతి గర్వించేలా ఉన్నత శిఖరాలకు అధిరోహించారని పేర్కొన్నారు.

సినారె తన రచనలతో ఎంతో మందిని చైతన్యపరిచారని గుర్తుచేశారు. భవిష్యత్ తరాలకు సినారె స్ఫూర్తిదాయకమని అన్నారు. సినారె రచనలు, ప్రసంగాలను వారి కుటుంబ సభ్యులు గ్రంథ రూపంలో తెస్తే దానికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. గద్దర్ పేరిట అవార్డులిస్తామని గతంలో ఇదే వేదికపై తాను ప్రకటించానని, ఇందుకోసం సినీ ప్రముఖులెవరూ తనను సంప్రదించలేదని అన్నారు. ఇకనైనా ముందుకు రావాలని కోరారు. సినారె పురస్కారాన్ని పొందిన శివశంకరిని, అవార్డును అందజేస్తున్న సినారె కుటుంబసభ్యులను అభినందించారు. అనంతరం సీఎంను నిర్వాహకులు సన్మానించారు.

అంతకు ముందు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు సినారె తన పాటలతో మైమరిపించారని అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు వేములవాడ ప్రాంతం అభివృద్ధి కోసం నిధులు కేటాయించి బ్రిడ్జిలు నిర్మించారని కొనియాడారు. సినారె పురస్కారగ్రహీత శివశంకరి మాట్లాడుతూ.. డా.సినారె అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని రోజని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, శాంతి బయోటెక్ వ్యవస్థాపకుడు డా.వరప్రసాద్‌రెడ్డి, ప్రముఖ సినీనటుడు మురళీమోహన్, సినారె కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

సాహిత్య రంగానికి సినారె సేవలు మరువలేనివి : జూకంటి

రాజన్న సిరిసిల్ల, జూలై 29(విజయక్రాంతి): సాహిత్య రంగానికి సినారె చేసిన సేవలు  మరువలేనివి అని దాశరథి కృష్ణమాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం అన్నారు. సినారె జయంతి సందర్భంగా జిల్లా సాహితీ సమితి (సిసా) ఆధర్యంలో  సిరిసిల్లలో వేడుకలు నిర్వహించారు. సాహిత్యరంగంలో ఆయన చేసిన సేవలను నెమరేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జనపాల శంకర య్య, ప్రధాన కార్యదరి వెంగళ లక్ష్మణ్, డా .చిటికెన కిరణ్ కుమార్, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఎలగొండ రవి తదితరులు పాల్గొన్నారు. 

సినారె నుంచి పట్టుదలనేర్చుకోవాలి:  ఆచార్య గౌరీశంకర్ 

సినారె నుంచి పట్టుదల, స్వయంకృషి, క్రమశిక్షణ, సమయపాలన నేర్చు కోవాలని తెలుగు విశ్వవిద్యాలయ పూ ర్వ రిజిస్ట్రార్, ఆచార్య గౌరీశంకర్ యువతకు పిలుపునిచ్చారు. సినారె జయంతి ని పురస్కరించుకుని రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాటను తన ఆరోప్రాణంగా చేసుకుని తొలి రోజుల్లో గేయకావ్యాలు రాశారని సినారె గురించి గుర్తుచేసుకున్నారు.

అనంతరం డాక్టర్ నాలేశ్వరం శంకరం మాట్లాడుతూ.. సామాజిక సందర్భాలకు అనుకూలంగా కవిత్వం రాశారని గజల్, ప్రపంచ పదులు, సినారె ముద్ర తో వెలువడ్డాయని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ యాకూబ్, డాక్టర్ నా మోజు బాలాచారి, ప్రముఖ గాయకుడు పల్లె నరసింహ, డాక్టర్ రాపోలు సుదర్శన్, సోమశిల తిరుపాల్, డాక్టర్ డబ్బికార్ రూప్‌కుమార్, డాక్టర్ వేముల నారాయణ, డాక్టర్ జయప్రకాష్, నాగభూషణం, సాహితీవేత్తలు పాల్గొన్నారు.